Unmukth Chand: భారత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉన్ముక్త్‌ చంద్‌

13 Aug, 2021 17:41 IST|Sakshi

ముంబై: భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ శుక్రవారం భారత్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్‌ చంద్‌ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్‌ ట్విటర్‌ వేదికగా బీసీసీఐకి సుధీర్ఘ నోట్‌ రాశాడు. కాగా 2012 అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ (111 పరుగులు నాటౌట్‌) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్‌ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ మధ్య కాలంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 చాంపియన్స్‌ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్‌  ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేక వెనుకబడిపోయాడు. ఇక ఉన్ముక్త్‌ చంద్‌ 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్‌లో 77 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన చంద్‌ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్‌ చంద్‌ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు.

ఇక భారత్‌ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్‌ చంద్‌ స్పందిస్తూ..'' భారత్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. తాజా రిటైర్మెంట్‌తో భారత్‌ క్రికెట్‌కు ఇక ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. కానీ విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన భారత క్రికెట్‌ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు