‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’

2 Dec, 2020 12:36 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో అర్ధ సెంచరీ(63) సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా 242వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ సాధించి సచిన్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అయితే ఇదే మ్యాచ్‌లో కోహ్లి తన వన్డే కెరీర్‌లో ఓ చేదు అనుభవాన్ని కూడా మూటగట్టుకున్నాడు. ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ఈ ఏడాదిని ముగించాడు. కాగా గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ రన్‌మెషీన్‌.. వన్డేల్లో ఇప్పటి వరకు మొత్తంగా 43 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 2009 డిసెంబరులో ఈడెన్‌గార్డెన్స్‌ మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత ప్రతీ ఏటా కనీసంగా ఒక్క సెంచరీ అయిన తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో  2020లో కేవలం 9 ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి ఒక్క మ్యాచ్‌లోనూ వంద పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో అరుదైన(12వేల పరుగులు), చెత్త రికార్డును నమోదు చేశావంటూ కోహ్లిని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని నిరాశపరిచావు. అర్ధ సెంచరీని, సెంచరీగా మారిస్తే జట్టుకు కూడా ఉపయోగకరంగా ఉండేది కదా. సెంచరీ చేయకుండానే 2020ని ముగించేశావు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: అదరగొట్టిన పాండ్యా, జడేజా; 300 దాటిన స్కోరు!)

కాగా ఆసీస్‌తో మూడో వన్డేలో టాస్‌ గెలిచిన కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను అబాట్‌, అగర్‌లు పెవిలియన్‌కు చేర్చగా.. ఆడం జంపా శ్రేయస్‌ అ‍య్యర్‌ను అవుట్‌ చేశాడు. ఇక వచ్చీరాగానే కేఎల్‌ రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూగా అగర్‌ వెనక్కి పంపగా, నిలకడగా ఆడుతున్న కెప్టెన్‌ కోహ్లిని హాజిల్‌వుడ్‌ అవుట్‌ చేశాడు. దీంతో 152 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆల్‌రౌండర్లు పాండ్యా, జడేజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 108 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా  నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇక  ఈ సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్‌ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది.

మరిన్ని వార్తలు