#Kohli-Gill: ముందే అనుకున్నారా.. కలిసే సెంచరీలు కొడుతున్నారు!

27 May, 2023 22:38 IST|Sakshi
Photo: IPL Twitter

విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌.. ఇద్దరిలో ఒకరు ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకొని క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తుంటే.. మరొకరు యంగ్‌ ప్లేయర్‌గా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆటలో ఎవరికి వారే సాటి. గిల్‌ కోహ్లి కంటే చాలా సీనియర్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే కోహ్లి ఆటను చూస్తూ గిల్‌ పెరిగాడు. అలాంటిది ఈ ఇద్దరు ఇప్పుడు టీమిండియా తరపున కీలక బ్యాటర్లుగా ఎదిగారు. 

మరో విశేషమేమిటంటే ఈ ఇద్దరు కలిసి ఈ ఏడాది మూడు వేర్వరు మ్యాచ్‌ల్లో ఒకేసారి సెంచరీలతో మెరిశారు. అందులో రెండు మ్యాచ్‌లు టీమిండియా తరపున .. మరొకటి ఐపీఎల్‌లో వేర్వేరు జట్లు తరపున ఒకే మ్యాచ్‌లో సెంచరీలు బాదారు. 

తొలిసారి లంకతో జరిగిన మూడో వన్డేలో


ఈ ఏడాది శుబ్‌మన్‌ గిల్‌, కోహ్లిలు ఒకే మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసింది లంకతో జరిగిన మూడో వన్డేలో. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఓపెనర్‌ గిల్‌ 116 పరుగులు సెంచరీ చేయగా.. ఆ తర్వాత కోహ్లి 166 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. 

రెండోసారి.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో


ఇక ఈ ఇద్దరు ఒకే మ్యాచ్‌లో రెండోసారి సెంచరీలు చేసింది బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్‌ అయింది. శుబ్‌మన్‌ గిల్‌ 128 పరుగులు చేయగా.. కోహ్లి 186 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది.

ఐపీఎల్‌లో ముచ్చటగా మూడోసారి


Photo: IPL Twitter

ఇక ముచ్చటగా మూడోసారి ఒకే మ్యాచ్‌లో సెంచరీలు బాదింది ఐపీఎల్‌లో. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా సెంచరీలు సాధించారు. ప్లేఆఫ్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి 101 నాటౌట్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఆర్‌సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 104 పరుగులు నాటౌట్‌ చివరివరకు నిలిచి గుజరాత్‌ను గెలిపించి ఆర్‌సీబీ లీగ్‌ స్టేజీలోనే వెనుదిరగడానికి కారణమయ్యాడు. అలా కోహ్లి, గిల్‌లు ముచ్చటగా మూడుసార్లు మూడు వేర్వేరు మ్యాచ్‌ల్లో సెంచరీలతో మెరిసి అరుదైన ఘనత సాధించారు.

ఐపీఎల్‌ అనంతరం ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మరోసారి ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా జూన్‌ ఏడు నుంచి 11 వరకు ఓవల్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

చదవండి: జడ్డూకు ఫుల్‌ డిమాండ్‌.. సీఎస్‌కే నుంచి బయటికి వస్తే?!

మరిన్ని వార్తలు