కోహ్లి ఫిజియో అవతారం.. చూసి తీరాల్సిందే

5 Feb, 2021 19:47 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కాసేపు ఫిజియో అవతారం ఎత్తాడు. జో రూట్‌కు కాలి కాండరాలు పట్టేయడంతో కోహ్లి అతని వద్దకు వెళ్లి మర్దన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 86వ ఓవర్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ వేశాడు. అప్పటికే సెంచరీ చేసి జోరు మీదున్న జో రూట్‌, ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లి క్రీజులో ఉన్నారు.

అశ్విన్‌ వేసిన ఓవర్‌ చివరి బంతిని రూట్‌ సిక్స్‌గా మలిచాడు. అయితే ఓవర్‌ ముగిసిన తర్వాత రూట్‌కు కాలి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడుతూ ఫిజియోకు సైగ చేశాడు. ఇంతలో రూట్‌ అవస్థను గమనించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అతని వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. రూట్‌ను నేలపై ఉంచి అతని కాలును పైకి లేపి మర్దన చేసి కాస్త ఉపశమనం కలిగించాడు. ఇంతలో ఫిజియో వచ్చి రూట్‌కు ప్రథమ చికిత్స నిర్వహించాడు.

అయితే కోహ్లి చేసిన పనిని ఐసీసీ పొగడ్తలతో ముంచెత్తింది. ఆటలో ప్రత్యర్థులైనా.. క్రీడాస్పూర్తిలో నీకు నువ్వే సాటి అంటూ కోహ్లి అంటూ క్యాప్షన్‌ జత చేస్తూ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 89.3 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీతో మెరవగా.. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లీ 87 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: అంతా బయటివాళ్లే... మనోళ్లు ఒక్కరు లేరు
హెల్మెట్‌తో స్లిప్‌ ఫీల్డింగ్‌.. సూపర్ అంటున్న నెటిజన్లు

>
మరిన్ని వార్తలు