WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్‌.. ఆల్‌టైం రికార్డు బద్దలు

10 Oct, 2023 13:44 IST|Sakshi

ICC Cricket World Cup 2023-England vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్‌ పేరిట ఉన్న రికార్డును రూట్‌ బద్దలు కొట్టాడు.

కాగా భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఇంగ్లండ్‌ తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ధర్మశాల వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

మలన్‌ విధ్వంసకర శతకం
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్‌ టీమ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్‌ స్టో అర్ధ శతకం(52), డేవిడ్‌ మలన్‌ సునామీ సెంచరీ(140)తో అద్భుత ఆరంభం అందించారు. ఈ క్రమంలో బెయిర్‌స్టో స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ జో రూట్‌.. 33.4 ఓవర్లో షోరిఫుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో ఫోర్‌ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు.

A post shared by ICC (@icc)

అదే జోష్‌లో అరుదైన ఘనత కూడా సాధించాడు. మరోసారి షోరిఫుల్‌ ఇస్లాం బౌలింగ్‌లోనే(35.4ఓవర్‌) రెండు పరుగులు తీసి.. గ్రాహం గూచ్‌ను అధిగమించాడు. తద్వారా వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 

ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 క్రికెటర్లు
1.జో రూట్‌- 898*
2.గ్రాహం గూచ్‌- 897
3.ఇయాన్‌ బెల్‌- 718
4.అలన్‌ లాంబ్‌- 656
5.గ్రేమ్‌ హిక్‌- 635.

A post shared by ICC (@icc)

చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్‌! వాళ్లలో ఒకరికి గోల్డెన్‌ ఛాన్స్‌.. వరల్డ్‌కప్‌ జట్టులో!

మరిన్ని వార్తలు