WC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ అవార్డు రోహిత్‌ శర్మకే! ఎందుకంటే?

6 Nov, 2023 15:26 IST|Sakshi
ఈసారి మెడల్‌ రోహిత్‌ శర్మకే(PC: BCCI)

సౌతాఫ్రికాపై ఘన విజయం తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు విజేతగా వినూత్న రీతిలో హిట్‌మ్యాన్‌ పేరును ప్రకటించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా దిలీప్‌ కొత్త సంప్రదాయానికి తెరతీసిన విషయం తెలిసిందే.

ఫీల్డ్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లలో ఒకరిని ఎంపిక చేసి.. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మెడల్‌తో సత్కరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌ తర్వాత దిలీప్‌ బగ్గీ క్యామ్‌(కెమెరా)ను ఉపయోగించి విన్నర్‌ను అనౌన్స్‌ చేశాడు. అయితే, ఈసారి ఫీల్డర్‌కు కాకుండా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన కెప్టెన్‌కు మెడల్‌ ఇవ్వడం విశేషం.

తొలుత డ్రెస్సింగ్‌రూంలో ఆటగాళ్లతో మాట్లాడిన దిలీప్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలపై ప్రశంసలు కురిపించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్‌ చేశారని కొనియాడాడు. అనంతరం క్రికెటర్లందరినీ మైదానంలోకి తీసుకువెళ్లిన దిలీప్‌.. విజేత దగ్గర బగ్గీ క్యామ్‌ ఆగుతుందని అందరిని ఒక్కచోట నిలబెట్టాడు.

ఈ క్రమంలో క్యామ్‌ రాహుల్‌, జడేజా, సూర్యల వైపు కదిలింది. అయితే, ఆఖర్లో రోహిత్‌ శర్మ వద్ద నిలిచిపోయింది. దీంతో యువ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ వచ్చి రోహిత్‌ను గట్టిగా హత్తుకుని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఈ సందర్భంగా దిలీప్‌ మాట్లాడుతూ.. ‘‘జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు మెడల్‌ అందుకునేందుకు అర్హులే అని నిరూపించుకునేందుకే ఇలాంటివి ఉపయోగపడతాయి. కేవలం క్యాచ్‌ అందుకున్న వాళ్లకు.. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసం చేసిన వాళ్లకు మాత్రమే కాదు.. 

వాళ్లు అలా చురుగ్గా కదిలేలా.. సరైన చోట సరైన వ్యక్తిని నిలిపిన కెప్టెన్‌ పాత్ర కూడా కీలకం. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అద్భుతమైన వ్యూహాలతో ఇంతటి ఘన విజయం అందించాడు. అందుకే ఈ మెడల్‌’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.

కాగా గత మ్యాచ్‌లో మెడల్‌ అందుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి రోహిత్‌ మెడలో మెడల్‌ను వేశాడు. ఇక సౌతాఫ్రికాను 83 పరుగులకే ఆలౌట్‌ చేసి టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సెమీస్‌ చేరిన రోహిత్‌ సేన పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని నిలుపుకొంది.

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని వార్తలు