WC 2023: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్‌ వివాదస్పద ట్వీట్‌! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి!

11 Oct, 2023 19:19 IST|Sakshi

WC 2023 Pak Vs SL: పాకిస్తాన్‌ వికెట్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ వివాదాస్పద ట్వీట్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఆటతో సంబంధంలోని విషయంలో తలదూర్చి నెటిజన్ల చేతికి చిక్కాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో రిజ్వాన్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో లంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌(113)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి పాకిస్తాన్‌కు రికార్డు విజయం అందించాడు.

121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చెలరేగి.. 131 పరుగులతో రాణించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఎక్స్‌ వేదికగా రిజ్వాన్‌ చేసిన పోస్టు విమర్శలకు కారణమైంది.

గాజాలో ఉన్న నా సోదర, సోదరీమణుల కోసం
‘‘జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇది సమిష్టి విజయం. అబ్దుల్లా షఫీక్‌, హసన్‌ అలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వాళ్ల వల్లే గెలుపు సులువైంది. 

హైదరాబాద్‌ ప్రజలకు మేము రుణపడి ఉంటాం. మీ ఆతిథ్యానికి.. మాకు మద్దతుగా నిలిచినందుకు కృత​జ్ఞతలు’’ అని రిజ్వాన్‌ రాసుకొచ్చాడు. అయితే, పోస్ట్‌ ఆరంభంలో.. ‘‘ఇది గాజాలో ఉన్న మా సోదర, సోదరీమణుల కోసం’’ అంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని షేర్‌ చేయడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

నువ్వు ఎవరికి సపోర్టు?
‘‘నువ్వు గాజా ప్రజలకు సపోర్టు చేస్తున్నావా? లేదంటే.. హమాస్‌ మిలిటెంట్లకు మద్దతు ప్రకటిస్తున్నావా? చర్యకు ప్రతి చర్య ఉంటుందనే విషయం తెలియదా?’’ అంటూ కొంతమంది ఫైర్‌ అవుతున్నారు. మరికొందరేమో.. ‘‘నీ సెంచరీ గాజా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది.

కనీసం ఈ మ్యాచ్‌ను చూసే స్థితిలో కూడా లేరు అక్కడి వాళ్లు. అయినా వరల్డ్‌కప్‌ లాంటి ఐసీసీ ఈవెంట్‌ ఆడుతున్నపుడు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీ మ్యాచ్‌ ఫీజులు, రెమ్యునరేషన్లు గాజా ప్రజల కోసం విరాళంగా ఇవ్వు’’ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ప్రతిసారి ఆటలోకి ఇలాంటివి లాగడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. కాగా గాజాలో తిష్టవేసిన హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి దిగడంతో యుద్ధానికి తెరలేచింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇటు గాజా.. అటు ఇజ్రాయెల్‌లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది.

చదవండి: నవీన్‌ ఉల్‌ హక్‌ రనౌట్‌ మిస్‌.. రాహుల్‌పై కోహ్లి సీరియస్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు