MS Dhoni: ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్‌గా ముగిస్తే బాగుండేది!

24 Mar, 2022 15:34 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 ప్రారంభానికి రెండో రోజుల ముందు టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని బాంబు పేల్చాడు. సీఎస్‌కే నాలుగుసార్లు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ధోని తాజాగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ధోని స్థానంలో జడేజా సీఎస్‌కేను నడిపించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం తన ట్విటర్‌లో ప్రకటించింది. అయితే ధోని ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎలాగూ ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి తలైవా కెప్టెన్‌గానే ఐపీఎల్‌ను ముగిస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. టైటిల్‌ గెలిచినా.. గెలవకపోయినా ధోని కెప్టెన్‌గా ఉంటూనే సీఎస్‌కే యాక్టివ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ధోని ఈ సీజన్‌లో కేవలం ఆటగాడిగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాడని.. అందుకే జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముందే అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టే.. ఐపీఎల్‌ మెగావేలానికి ముందు ధోనితో పాటు జడేజా, రుతురాజ్‌లను సీఎస్‌కే రిటైన్‌ చేసుకుంది. అయితే ధోని తనకు రూ. 15 కోట్లు వ్యర్థమని.. తన కంటే జడేజాకు ఎక్కువ ప్రైజ్‌ ఇవ్వడం శ్రేయస్కరమని స్వయంగా పేర్కొన్నాడు. దీంతో జడేజాకు రూ. 16 కోట్లు పెట్టి సీఎస్‌కే రిటైన్‌ చేసుకుంది. అలాగే ధోనికి కూడా రూ.12 కోట్లు పెట్టి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. దీంతో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని దీన్నిబట్టే అర్థమవుతుంది.

ఇక ధోని కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి.. సీఎస్‌కేలో ఆటగాడిగా.. అటు మెంటార్‌గా తన సలహాలు మాత్రం వస్తూనే ఉంటాయి. జడేజా ప్రత్యక్షంగా కెప్టెన్‌ అయినప్పటికి.. పరోక్షంగా మాత్రం ధోనినే నడిపిస్తాడనేది అందరికి తెలిసిన సత్యం. మరోవైపు జడేజా కూడా 2012 నుంచి సీఎస్‌కేతో పాటే ఉన్నాడు. ధోనికి అత్యంత నమ్మకమైన ఆటగాళ్లలో రైనా తర్వాత జడేజానే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఏరికోరి కెప్టెన్సీని అతడికే అప్పగించాడు.

ఇక ఆరంభం నుంచి సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఐపీఎల్‌ చరిత్రలోనే అ‍త్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. నాలుగుసార్లు జట్టును చాంపియన్‌గా నిలపడంతో పాటు ఒక జట్టును ఎక్కువసార్లు ఫైనల్స్‌, ప్లే ఆఫ్‌ వరకు తీసుకెళ్లిన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో ధోని సారధ్యంలో సీఎస్‌కే నాలుగుసార్లు టైటిల్‌ గెలిచింది. ఇక మార్చి 26న కేకేఆర్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెరలేవనుంది.

చదవండి: IPL 2022: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్సీకి గుడ్‌ బై.. కొత్త సారథి ఎవరంటే!

మరిన్ని వార్తలు