బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా..? అక్తర్‌ స్లెడ్జింగ్‌కు సెహ్వాగ్ కౌంటర్

14 Jul, 2021 16:45 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు దాయాది పాక్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌ ఎంత ప్రత్యేకమైందో వివరించి చెప్పాల్సిన పని లేదు. నాటి మ్యాచ్‌లో సెహ్వాగ్ (375 బంతుల్లో 309; 39 ఫోర్లు, 6 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ ప్రధాన పేసర్ షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌ను పదేపదే విసిగించాడు. వారి మధ్య జరిగిన నాటి సంభాషణను మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా పంచుకున్నాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..  

ఆ టెస్ట్‌లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అక్తర్ అతనిపైకి షార్ట్ పిచ్ బంతులతో దాడి చేశాడు. పదే పదే బౌన్సర్లు సంధించాడు. ఇక సెహ్వాగ్ ప్రతి షార్ట్ బాల్‌ను డకింగ్( బంతిని వదిలేసి కిందికి వంగడం) చేశాడు. సెహ్వాగ్ తెలివైన వ్యూహానికి చిర్రెత్తుకుపోయిన అక్తర్ అతని దగ్గరకు వెళ్లి.. ఒక్క పుల్ షాట్ ఆడే ప్రయత్నమైనా చేయొచ్చుగా అని కోరాడు. దానికి సెహ్వాగ్.. అరే అక్తర్.. నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా అని దిమ్మతిరిగే బదులిచ్చాడని నాటి మ్యాచ్‌ విశేషాలను మంజ్రేకర్‌ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా, సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముల్తాన్ టెస్ట్‌లో భారత్‌ రెండే రోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండు రోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆలౌట్‌ చేసి ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్‌ టెండూల్కర్‌ (194 ) డబుల్‌ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మ్యాచ్‌ను డిక్లేర్‌ చేశాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. సచిన్‌ తన కన్న ముందు 5 డబుల్‌ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్‌ మ్యాచ్‌ను డిక్లర్‌ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్‌ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్‌ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్‌ తన బయోగ్రఫీ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే' లో ప్రస్తావించాడు. 
 

మరిన్ని వార్తలు