నాడు భర్త, నేడు భార్య.. ప్రపంచకప్‌ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు గెలుచుకున్న భార్య భర్తలు

3 Apr, 2022 15:50 IST|Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022 ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్‌ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించడంతో  నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హీలీకి జతగా మరో ఓపెనర్‌ రేచల్‌ హేన్స్‌ (68), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ మూనీ (62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ష్రబ్‌సోల్‌ 3, ఎక్లెస్టోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. నతాలీ స్కీవర్‌ (121 బంతుల్లో 148 నాటౌట్‌; 15 ఫోర్లు, సిక్స్‌) ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్‌ బౌలర్లు అలానా కింగ్‌ (3/64), జెస్‌ జోనాస్సెన్‌ (3/57), మెగాన్‌ షట్‌ (2/42) ధాటికి  43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్‌ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో పాటు వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ శతకం (129) బాదిన అలీసా హీలీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా లభించింది. 


కాగా, 2022 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 56.56 సగటున 2 సెంచరీలు, 2 హాఫసెంచరీల సాయంతో  509 పరుగులు చేసిన ఆసీస్ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అలీసా హీలీ  ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుతో పాటు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ప్లేయర్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.


2020 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ప్లేయర్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న హీలీ తాజాగా ఆ ఘనతను మరోసారి సాధించింది. ఇదిలా ఉంటే.. హీలీ భర్త, స్టార్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2015లో భర్త ఆసీస్‌ వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. తాజాగా భార్య తన దేశాన్ని ఏడోసారి జగజ్జేతగా నిలిపింది.
చదవండి: World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా

మరిన్ని వార్తలు