ఆరో స్థానంలో హంపి

29 Dec, 2021 05:07 IST|Sakshi

వార్సా (పోలాండ్‌): ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. హంపితోపాటు మరో ఎనిమిది మంది కూడా 7.5 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హంపికి ఆరో స్థానం దక్కింది. రష్యా గ్రాండ్‌మాస్టర్‌ కొస్టెనియుక్‌ 9 పాయింట్లతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. బిబిసారా (కజకిస్తాన్‌–8.5) రన్నరప్‌ నిలిచింది. గునీనా (రష్యా), కాటరీనా (రష్యా), సెరిక్‌బె (కజకిస్తాన్‌) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు