ICC T20 Qualifiers: టీ20 క్రికెట్‌ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదు.. 

1 Sep, 2021 14:04 IST|Sakshi

ముర్షియా: టీ20 క్రికెట్‌ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదవుతున్నాయి. ముర్షియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌(యూరోప్‌ రీజియన్‌) పోటీలు ఈ పరమ చెత్త రికార్డులకు వేదికగా నిలిచాయి. ఆగస్ట్‌ 26న మొదలైన ఈ క్వాలిఫయర్‌ పోటీల్లో యూరోపియన్‌ మహిళా క్రికెట్‌ జట్లు ఒకదాని మించి ఒకటి పోటీపడుతూ.. పొట్టి ఫార్మాట్‌ పరువును బజారుకీడ్చాయి. నెదర్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టీ20ల్లో జరగకూడని ఘోరాలన్నీ జరిగిపోయాయి. 

ఓ జట్టేమో(జర్మనీ) 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే స్కోర్‌ చేసి అత్యంత జిడ్డు బ్యాటింగ్‌ను ప్రేక్షకులకు రుచి చూపించగా, మిగతా జట్లు తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీ పడి మరీ జిడ్డు ఆటకు బ్రాండ్‌ అంబాజిడర్లుగా నిలిచి టీ20ల్లో అత్యల్ప స్కోర్‌లను నమోదు చేసాయి. ఈ జట్లలో ఫ్రాన్స్‌ పరిస్థితి అయితే మరీ దారుణం. ఆ జట్టు  ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 33 ఆలౌట్‌(నెదర్లాండ్‌పై), 45 ఆలౌట్‌(ఫ్రాన్స్‌పై), 24 ఆలౌట్‌(ఐర్లాండ్‌పై), 24 ఆలౌట్‌(స్కాట్లాండ్‌పై) స్కోర్లు నమోదు చేసింది. 

ఈ అత్యల్ప స్కోర్లన్నీ అటుఇటు 20 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన సాధించినవే కావడంతో క్రికెట్‌ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ జట్టుకు ఐసీసీ పోటీల్లో అనుమతిచ్చింది ఎవడ్రా అంటూ సోషల్‌మీడియలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక స్కాట్లాండ్‌తో ఫ్రాన్స్‌ ఆడిన చివరి మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫ్రాన్స్‌ మహిళా జట్టు 17.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 24 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే నమోదైంది. అనంతరం స్కాట్లాండ్‌ కేవలం14 బంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది. 
చదవండి: వైడ్‌ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

మరిన్ని వార్తలు