Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా టీమిండియా సారథి

1 Mar, 2023 17:11 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(PC: Mumbai Indians)

Women Premier League 2023: మహిళా ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ తమ కెప్టెన్‌ పేరును ప్రకటించింది. టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. 

కాగా హర్మన్‌ప్రీత్‌ భారత మహిళా క్రికెట్‌ జట్టులో కీలక సభ్యురాలిగా ఉండి.. మిథాలీ రాజ్‌ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా టీ20 టోర్నీలో జట్టును సెమీస్‌ వరకు చేర్చింది. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 

సరికొత్త ఇన్నింగ్స్‌
ఇరవై ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్‌.. దాదాపు దశాబ్దకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు వెన్నుముకగా ఉంది. ఆమె అందించిన సేవలకు గానూ అర్జున అవార్డు లభించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ కుటుంబంలో అడుగుపెట్టిన హర్మన్‌..  డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనుంది. 

ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ మహిళా జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న చార్లెట్‌ ఎడ్వర్డ్‌తో పలు మ్యాచ్‌లలో తలపడ్డ హర్మన్‌.. మెంటార్‌ ఝులన్‌ గోస్వామి ఉన్న జట్టుకు సారథ్యం వహించడం విశేషం. ఇక.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత ముంబైది. 

గుజరాత్‌తో మ్యాచ్‌తో ఆరంభం
ఇప్పుడు ఇద్దరు టీమిండియా కెప్టెన్లు రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒకే ఫ్రాంఛైజీ జట్లకు సారథులుగా ఉండటం మరో విశేషం. దీంతో ముంబై ఫ్యాన్స్‌ సంబరాలు రెట్టింపయ్యాయి. తొలి సీజన్‌లో ముంబై టైటిల్‌ సాధించాలని అభిమానులు హర్మన్‌కు ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌తో మార్చి 4న మహిళా ప్రీమియర్‌ లీగ్‌కు తెరలేవనుంది. 

ముంబై ఇండియన్స్‌ మహిళా జట్టు కోచింగ్‌ స్టాఫ్‌
హెడ్‌కోచ్‌- చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌(ఇంగ్లండ్‌)
బౌలింగ్‌ కోచ్‌, మెంటార్‌- ఝులన్‌ గోస్వామి(ఇండియా)
బ్యాటింగ్‌ కోచ్‌- దేవికా పల్షికార్‌(ఇండియా)
ఫీల్డింగ్‌ కోచ్‌- లిడియా గ్రీన్‌వే(ఇంగ్లండ్‌)

ముంబై ఇండియన్స్‌ జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత.

చదవండి: Yashasvi Jaiswal: అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌.. డబుల్‌ సెంచరీతో..!

మరిన్ని వార్తలు