గాయాల వల్లే వెనుకబడ్డాను

23 May, 2021 04:45 IST|Sakshi

భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా

బ్యాటింగ్‌ శైలి మార్చుకోనని వ్యాఖ్య

కోల్‌కతా: తరచూ గాయాల వల్లే కెరీర్‌ సాఫీగా సాగడం లేదని టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు. 2010లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సాహా ఇన్నేళ్లయినా తన ముద్ర వేయలేకపోయాడు. అయితే వైఫల్యాలకంటే కంటే తనని గాయాలే ఇబ్బంది పెట్టాయన్నాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటన కోసం సిద్ధమైన సాహా ముంబైలో జట్టుకు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో సోమవారం చేరతాడు. ‘సరిగ్గా ఆడకపోతే విమర్శలు తప్పవు. నాకూ తప్పలేదు. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నాను. ఇన్నేళ్లయినా నా బ్యాటింగ్‌ ఏమాత్రం మెరుగవలేదని చాలామంది విమర్శిస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు కానీ... నా బ్యాటింగ్‌ శైలిని, టెక్నిక్‌ను మార్చుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే అందులో ఏ లోపం లేదనే నేను అనుకుంటున్నాను.

నేనిపుడు పూర్తిగా ఆటమీదే దృష్టిపెట్టాను. మరింతగా శ్రమించాలనే పట్టుదలతో ఉన్నాను’ అని ఈ బెంగాలీ వికెట్‌ కీపర్‌ తెలిపాడు. ధోని రిటైర్మెంట్‌ తర్వాత ప్రధాన కీపర్‌గా ఎదగాల్సిన తనను గాయాలు పక్కనబెట్టాయని, 2018 సీజన్‌ అంతా ఇలాగే ముగిసిపోయిందన్నాడు. అయితే డాషింగ్‌ బ్యాట్స్‌మన్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అందివచ్చిన అవకాశాల్ని బాగా సద్వినియోగం చేసుకోగలిగాడని సాహా కితాబిచ్చాడు. ‘నేను గాయాల బారిన పడిన ప్రతీసారి పార్థివ్‌ పటేల్, దినేశ్‌ కార్తీక్, పంత్‌ ఇలా ఎవరో ఒకరు జట్టులోకి వచ్చారు. వీరిలో రిషభ్‌ మాత్రం సత్తా చాటుకున్నాడు. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడి పదిలంగా పాతుకుపోయాడు’ అని సాహా వివరించాడు. భారత జట్టుకు ఆడటమే ఓ వరమని, ఆ ప్రేరణే తనని ఆశావహంగా నడిపిస్తోందని చెప్పాడు. 

గాయాలు, వైఫల్యాలనేవి ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఉంటాయని, అలాగే తనకూ అలాంటి సవాళ్లు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ‘నేను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచించాను. నేను ఆడినా, ఆడకపోయినా టీమ్‌ గెలవడమే ముఖ్యమ ని భావించా. జట్టులో స్థానం లభిస్తుందా లేదా అనే అంశాల కారణంగా  సహచరులతో నా సంబంధాలు ఎప్పుడూ చెడిపోలేదు’ అని సాహా స్పష్టం చేశాడు. సాహా 11 ఏళ్ల కెరీర్‌ ఇప్పటికీ గాయాలతో పడుతూ లేస్తూ సాగుతోంది. 38 టెస్టులాడిన ఈ బెంగాలీ క్రికెటర్‌ 1251 పరుగులు చేశాడు. 103 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేయడంలో భాగమయ్యాడు. కివీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (డబ్ల్యూటీసీ)తో పాటు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ పయనమవుతోంది. కరోనా, సుదీర్ఘ సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టులో పంత్, సాహాలతో పాటు బ్యాకప్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌కు కూడా చోటు దక్కింది.

మరిన్ని వార్తలు