సామాజిక సాధికార యాత్రకు బ్రహ్మరథం

10 Nov, 2023 05:04 IST|Sakshi
కావలిలో జరిగిన ర్యాలీలో యువత జోష్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో సామాజిక సాధికారతతో అణగారిన వర్గాల గొంతుకగా మారిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బడుగు, బలహీనవర్గాల ప్రజలు జేజేలు పలికారు. నాలుగు పేజీల మేనిఫెస్టోను గుండెనిండా నింపుకొని ప్రజాసంక్షేమమే శ్వాసగా, అట్టడుగు వర్గాలను అందలం ఎక్కించడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను నిండు మనస్సుతో ఆశీర్వదించారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కావలి పట్టణానికి జనం భారీగా తరలివచ్చారు. ఊహించని విధంగా తరలివచ్చిన జనవాహినితో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లు నిండిపోయాయి. ఎటు చూసినా పార్టీ పతాకాలు, జై జగన్‌ నినాదాలతో కావలిలో కోలాహలం నెలకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం బోగోలు మండలం కడనూతలలో మధ్యాహ్నం విద్యావంతులు, ప్రతిభావంతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత, తదితరులు హైవే మీదుగా మద్దూరుపాడు వద్ద కావలి పట్టణంలోకి ప్రవేశించారు. సాధికార యాత్ర జెండాచెట్టు సెంటర్‌కు చేరుకోగానే భారీగా తరలివచ్చిన జనం ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో మహిళల కోలాటాలు, హారతులు, కేరళ వాయిద్యాలు, తప్పెట్ల, యువత కేరింతలు, టపాకాయలతో అభిమానాన్ని చాటుకుంటూ ఘనస్వాగతం పలికారు. జనసందోహం నడుమ దివంగత సీఎం వైఎస్సార్‌, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా చెట్టు సెంటర్‌లోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తరువాత పాదయాత్రగా పొట్టిశ్రీరాములు విగ్రహ కూడలిలోని సభాస్థలికి చేరుకుని సభను ప్రారంభించారు. సభాస్థలి వద్ద జనం పోటెత్తారు. జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ఆయా వర్గాలకు పెద్దపీట వేశారని నాయకులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో సామాజిక చైతన్యం వెల్లివిరుస్తోందని, దేశ చరిత్రలో నినాదాలుగానే మిగిలిపోయిన సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత ఆయనదని, ఇది బడుగు, బలహీనవర్గాలకు అందించిన ఫలమని నాయకులు చెప్పిన సందర్భాల్లో సభలో ప్రజల నుంచి హర్షాధ్వానాలు వ్యక్తమయ్యాయి.

సామాజిక చైతన్యంతో

కదం తొక్కిన కావలి

కిటకిటలాడిన రోడ్లు, కూడళ్లు

మరిన్ని వార్తలు