నారాయణా... నీకంత సీన్‌ లేదు

28 Mar, 2024 00:15 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరును స్మార్ట్‌ సిటీగా చేయలేకపోయావ్‌

జగనన్న హయాంలోనే నెల్లూరు అభివృద్ధి

రూ.1100 కోట్లతో నగర సుందరీకరణ

ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు(దర్గామిట్ట): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే నెల్లూరు అభివృద్ధి చెందిందని, మాజీ మంత్రి నారాయణ చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా మిన్నకుండిన నారాయణకు ఇప్పుడు నెల్లూరు కనిపించిందా అని ప్రశ్నించారు. సిటీ అభ్యర్థిగా ఖలీల్‌ అహ్మద్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచి ఆయన్ను నారాయణ విమర్శిస్తున్నారని, తమ నాయకుడిని విమర్శించే అర్హత నారాయణకు లేదన్నారు. అభివృద్ధి అంటూ నారాయణ పదేపదే చెబుతుంటారని, భూగర్భ డ్రైనేజీకి రూ.49.5 కోట్లు ఽఅధిక టెండర్‌ వేశారన్నారు.

హడ్కో ద్వారా 90 శాతం నగదును 11 శాతం వడ్డీతో అప్పుగా తెచ్చారన్నారు. 2016లో ఇందుకు సంబంధించి మొదటి విడత పేమెంట్‌ తీసుకున్నప్పటికీ మూడేళ్లలో నగరంలో పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. రూ.830 కోట్లు హడ్కో నుంచి అప్పు తీసుకొచ్చి నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి ప్రాజెక్టులు తెచ్చామంటూ డప్పు కొట్టుకున్నారని, వాస్తవానికి ఏడు దశాబ్దాల క్రితమే నగరంలో 13 డివిజన్లలో భూగర్భ డ్రైనేజీ ఉందని, ఆయన కొత్తగా తెచ్చింది ఏమీలేదని అన్నారు. మిగిలిన డివిజన్లలో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ, మంచినీటి వసతి మధ్యలోనే వదిలేశారన్నారు. కార్పొరేషన్‌ ప్రజలపై మాత్రం రూ.830 కోట్ల అప్పుల భారం మోపారన్నారు.

అన్ని కోట్ల పనుల్లో వాటర్‌ పైప్‌లైన్‌ కోసం ఒక్క ఇంటికై నా కనెక్షన్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే పనులు చేపట్టారన్నారు. కార్పొరేషన్‌ బకాయిలలో రూ.730 కోట్లు జగనన్న ప్రభుత్వమే చెల్లించిందని అన్నారు. 2016లో కేంద్రం స్మార్ట్‌ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అమరావతి ప్రాంతాలను ప్రకటించిందన్నారు. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. అప్పుడు అదే శాఖలో ఏపీలో నారాయణ, కేంద్రంలో వెంకయ్యనాయుడు ఉండి కూడా నెల్లూరును ఎందుకు స్మార్ట్‌ సిటీలుగా చేయలేకపోయారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.1100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. నగరంలో సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్‌ కాలువ, పెన్నా రిటైనింగ్‌ వాల్‌, పెన్నా బ్యారేజ్‌, అదనంగా మరో పెన్నా బ్రిడ్జి నిర్మించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు