ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించండి | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించండి

Published Mon, Apr 8 2024 12:15 AM

పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌  - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్‌ అమలు, పాటించాల్సిన నియమాలు, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఎస్పీ పలు ఆదేశాలిచ్చారు. ఆయన ఆదివారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరనియంత్రణ విషయంలో సమృష్టిగా కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలన్నారు. చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాల వద్ద నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించి గ్రామ పెద్దలు, ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే ట్రబుల్‌ మాంగర్స్‌, రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను వెంటనే బైండోవర్‌ చెయ్యాలని ఆదేశించారు. నైట్‌ బీట్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీలు చేయాలన్నారు. నేర చరిత్ర కలిగిన, జైలు నుంచి విడుదలవుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలక్షన్‌ సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌) సౌజన్య, అడిషనల్‌ ఎస్పీ(క్రైమ్స్‌) ప్రసాద్‌, అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ శ్రీనివాసరావు, సబ్‌ డివిజన్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నగదు, మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌

Advertisement
Advertisement