నేడు ‘స్పందన’

20 Mar, 2023 01:08 IST|Sakshi
పెనుకొండ మండలం మునిమడుగులో నేల రాలిన మామిడికాయలు చూపుతున్న మహిళ

పుట్టపర్తి అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం ‘స్పందన’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

జిల్లా పోలీస్‌ కార్యాలయంలోనూ ‘పోలీస్‌ స్పందన’ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేయాలని సూచించారు.

దరఖాస్తుల పరిశీలన

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో బోధన పోస్టులు భర్తీ చేస్తున్నారు. 2018లో ఏర్పడిన ఈ యూనివర్సిటీలో బోధన ,బోధనేతర ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. తాజాగా మార్పు చేర్పులతో బోధన పోస్టుల భర్తీకి రీ నోటిఫికేషన్‌ను గత నెల 23న విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన గడువు ఈ నెల 15న ముగిసింది. దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక కమిటీలు నియమించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

నేడు ‘పోషణ్‌ పక్వాడా’పై

2కే ర్యాలీ

పుట్టపర్తి అర్బన్‌: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్‌ పక్వాడా పక్షోత్సవ కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రం పుట్టపర్తిలో 2కే ర్యాలీ ఉంటుందని ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్‌ సర్కిల్‌లో ఉదయం 9.30 గంటలకు కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ప్రారంభిస్తారన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వర్షాలతో పంటలకు నష్టం

అనంతపురం అగ్రికల్చర్‌: ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వానలు పడ్డాయి. అకాల వర్షాలకు పలు మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అమడగూరు మండలంలో 22 హెక్టార్లలో, నల్లచెరువు మండలంలో 8 హెక్టార్లలో, తనకల్లు–23, బుక్కపట్నం–2, ధర్మవరం–16, కొత్తచెరువు–91, బత్తలపల్లి–1, పెనుకొండ–116, రొద్దం–16, కదిరి–93, తలపుల–15, ఎన్‌పీకుంట–1, గాండ్లపెంట–3, ముదిగుబ్బ–8 హెక్టార్ల మేర పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా మొక్కజొన్న 349 హెక్టార్లలో దెబ్బతినగా, కొబ్బరి 41 హెక్టార్లు, ప్రొద్దుతిరుగుడు 25 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు.

మామిడికి బీమా సౌకర్యం కల్పించాలి

ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

పుట్టపర్తి: మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి కోరారు. ఆదివారం శాసనసభలో ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడ్డాయన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా చెరువులు నింపడంతో నీరు పుష్కలంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రోత్సాహంతో శ్రీసత్యసాయి జిల్లాలో ఉద్యాన తోటల విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇందులో మామిడి అత్యధిక విస్తీర్ణంలో సాగులోకి వచ్చిందన్నారు. అయితే, ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర లేక ఏటా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఉద్యాన తోటలకు కూడా బీమా వర్తింపజేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పుట్టపర్తి సమీపంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఫార్మర్‌ నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డిని కోరారు.

మరిన్ని వార్తలు