రారండోయ్‌ వేడుక చూద్దాం | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ వేడుక చూద్దాం

Published Sat, Nov 18 2023 9:04 AM

- - Sakshi

ప్రశాంతి నిలయం: ‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అని బోధించి భక్తజన ఇలవేల్పుగా మారిన సత్యసాయిబాబా 98వ జయంత్యుత్సవాలకు ప్రశాంతి నిలయం ముస్తాబైంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయిభక్తులంతా తరలివచ్చే ఈ విశ్వవేడుక కోసం అటు ప్రభుత్వమూ తగు చర్యలు తీసుకుంది. ఇప్పటికే వేడుక నిర్వహణకు వేదికై న సాయికుల్వంత్‌ సభా మందిరాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పుష్పాలు, దళాలతో సుందరంగా అలంకరించారు. పురవీధులకు మామిడి తోరణాలు కట్టారు. ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే సత్యసాయి భక్తులకు సేవలందించేందుకు సేవాదళ్‌ సభ్యులు ఇప్పటికే ప్రశాంతి నిలయం చేరుకున్నారు.

సత్యసాయి జయంత్యుత్సవాలు ఇలా...

● 18న ఉదయం వేణుగోపాల స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాన్య అరోరా బృందం సంగీత కచేరీ ఉంటుంది.

● 19న ఉదయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. గౌరవ అతిథిగా మైసూర్‌ రాజవంశీయురాలు రాజమాతా ప్రమోదాదేవి ఒడయార్‌, ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజే హాజరుకానున్నారు. విదేశీ సత్యసాయి భక్తురాలు పెట్రాకలినోస్కీ మహిళా భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాసురాలు సుధా రఘునాథన్‌ బృందం సంగీత కచేరీ ఉంటుంది.

● 20వ తేదీ సాయంత్రం రాజేష్‌ వైద్య బృందం సంగీత కచేరీ నిర్వహిస్తారు.

● 21న సాయంత్రం శివశ్రీ స్కంద ప్రసాద్‌ బృందం సంగీత కచేరీ ఉంటుంది.

● 22వ తేదీ సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవ వేడుకలు ప్రశాంతి నిలయంలోని సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొననున్నారు. సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యార్థులు కాన్వొకేషన్‌ డ్రామా నిర్వహిస్తారు.

● 23న సాయికుల్వంత్‌ సభా మందిరంలో బాబా జయంతి వేడుకలు నిర్వహిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు పంచరత్న కీర్తనలు ఆలపిస్తారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులు ట్రస్ట్‌ వార్షిక నివేదిక సమర్పిస్తారు. సాయంత్రం ప్రశాంతి నిలయం పురవీధుల్లో స్వర్ణ రథోత్సవం, అనంతరం సాయికుల్వంత్‌ సభా మందిరంలో జోలోత్సవం ఉంటుంది. కౌషిక్‌ చక్రవర్తి సంగీత కచేరీతో వేడుకలు ముగుస్తాయి.

లక్ష మందికి నారాయణ సేవ

సత్యసాయి జయంతి వేడుకలకు దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు మహానారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా అన్న ప్రసాదాల వితరణ ఉంటుంది. ఇందుకోసం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సర్వం సిద్ధం చేసింది. సత్యసాయి జయంత్యుత్సవాలు జరిగే ఆరురోజులూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భక్తులకు అన్నప్రసాదాలు వితరణ ఉంటుంది. సుమారు లక్ష మందికి అన్నదానం చేసే లక్ష్యంతో ప్రశాంతి నిలయంలోని నార్త్‌ బిల్డింగ్స్‌ వెనుక వైపు ఉన్న మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 850 మంది సత్యసాయి సేవాదళ్‌ సభ్యులు నారాయణ సేవలో పాలుపంచుకోనున్నారు. అన్న ప్రసాదాల పంపిణీకి మహిళలు, పురుషులకు వేర్వేరుగా 12 చొప్పున ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శుక్రవారమే అన్నప్రసాదాల తయారీ ప్రారంభించారు. సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు సత్యసాయి చిత్రపటానికి పూజలు నిర్వహించి అన్నప్రసాద తయారీని ప్రారంభించారు.

రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

ఆనవాయితీ ప్రకారం శనివారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో సత్యసాయి 98వ జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయికుల్వంత్‌ సభా మందిరంలో 2 వేల మంది సత్యసాయి భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రశాంతి నిలయంలోని ఉత్తర గోపురం వద్ద నుంచి వేణుగోపాల స్వామి రథోత్సవం ప్రారంభిస్తారు. ఇందుకోసం సెంట్రల్‌ ట్రస్ట్‌ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.

నేటి నుంచి సత్యసాయి

జయంత్యుత్సవాలు

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రశాంతి నిలయం

ఏర్పాట్లు పూర్తి చేసిన

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌

22న సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి

ద్రౌపది ముర్ము, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

23న సత్యసాయిబాబా

జయంతి వేడుకలు

నేడు పుట్టపర్తిలో వేణుగోపాలస్వామి రథోత్సవం

8 రోజుల పాటు వైద్య శిబిరాలు

బాబా జయంత్యుత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలోని నార్త్‌ బిల్డింగ్స్‌ వద్ద శనివారం నుంచి అంతర్జాతీయ మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన డాక్టర్‌.గీతా కామత్‌ నేతృత్వంలో 8 రోజుల పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ఐసీయూ, ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, కేన్సర్‌, డెర్మటాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ, ఫిమేల్‌ ఓపీడీ, ఆర్థోపెడిక్‌, సైకియాట్రిక్‌ సేవలు అందివ్వనున్నారు. రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకూ వైద్య శిబిరాలు కొనసాగనున్నాయి. అవసరమైన మందులను సైతం ఉచితంగా అందిస్తారు.

సత్యసాయిబాబా 98వ జయంత్యుత్సవాల్లో భాగంగా నవంబర్‌ 22న ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి స్నాతకోత్సవ ఉపన్యాసం చేయనున్నారు. అలాగే విద్యార్థులకు బంగారు పతకాలు అందివ్వనున్నారు.

22న పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రత్యేక అలంకరణలో సత్యసాయి మహా సమాధి (ఫైల్‌)
1/5

ప్రత్యేక అలంకరణలో సత్యసాయి మహా సమాధి (ఫైల్‌)

అలంకరణలో ప్రశాంతి నిలయం ప్రధాన ద్వారం
2/5

అలంకరణలో ప్రశాంతి నిలయం ప్రధాన ద్వారం

విద్యుత్‌ వెలుగుల్లో ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం
3/5

విద్యుత్‌ వెలుగుల్లో ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం

ఉత్సవానికి సిద్ధమైన వేణుగోపాల స్వామి రథం
4/5

ఉత్సవానికి సిద్ధమైన వేణుగోపాల స్వామి రథం

వీధులను అరటి తోరణాలతో అలంకరించిన దృశ్యం
5/5

వీధులను అరటి తోరణాలతో అలంకరించిన దృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement