ఎప్పుడో చుట్టపుచూపుగా వస్తాడు...పోనీ అప్పుడైనా కలుద్దామంటే కలవడు...

23 Dec, 2023 13:04 IST|Sakshi

హిందూపురం అర్బన్‌: ‘పురం’లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి ఎలాగైనా పురంపై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ రీజినల్‌ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. ఈకమంలో నియోజకవర్గంలోని నేతలతో సమావేశాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశాల్లోనే టీడీపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయన్న సంకేతాలు అందుకున్న టీడీపీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. దీంతో ఆగమేఘాలపై ఎమ్మెల్యే బాలకృష్ణను పిలిపించి అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.

టీడీపీ నేతలతో బాలకృష్ణ సమీక్ష ..
శుక్రవారం సాయంత్రం కొడికొండ చెక్‌పోస్ట్‌కు సమీపంలోని రాగమయూరీ లేఅవుట్‌కు చేరుకున్న బాలకృష్ణ... పంచాయతీల్లోని నాయకులు, కార్యకర్తలకు కబురు పంపారు. చిలమత్తూరు మండలంలోని పంచాయతీల వారీ సమీక్షలు చేపట్టారు. చాలా మంది టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో ఆయా పంచాయితీల నేతలను బుజ్జగిస్తున్నారు. పార్టీలో సముచిత స్థానంతో పాటు పదవులు కూడా ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ తమను పట్టించుకోని బాలయ్య ఇప్పుడొచ్చి ఇచ్చే హామీలు ఏ మేరకు నిలబెట్టుకుంటాడో అన్న అనుమానం కార్యకర్తల్లో నెలకొంది.

కార్యకర్తల నిరుత్సాహం..
బాలకృష్ణ వచ్చినట్లు తెలుసుకున్న కొందరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలహారాలు తీసుకుని వెళ్లి ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడి సెక్యురిటీ, నాయకులు అనుమతించక పోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారు. ‘ఎప్పుడో చుట్టపుచూపుగా వస్తాడు...పోనీ అప్పుడైనా కలుద్దామంటే కలవడు... పూలహారాలకు డబ్బులు దండగ’’ అంటూ పలువురు కార్యకర్తలు బాలకృష్ణ విడిది చేసిన వసతి గృహం సమీపంలోనే పూలహారాలు పడేసి వెళ్లపోయారు.

మూడు నెలల్లో రూ.1.50 కోట్ల ఖర్చు..
టీడీపీ నేతలు ఇప్పటికే నియోజక వర్గ ఓటరు జాబితాల్లో 60 శాతం మంది వివరాలు వారి ప్రత్యేక యాప్‌లలో సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఉపయోగ పడేలా ఆధార్‌, ఓటర్‌ అకౌంట్‌ నంబర్‌ వివరాలు సేకరించారు. బూత్‌ కన్వీనర్లకు, వారి వద్ద ఉండే వారికి ప్రతి మండలానికి నెలనెలా రూ.5 లక్షల వరకు, పట్టణంలో రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇలా నియోజక వర్గ వ్యాప్తంగా మూడు నెలలుగా కేవలం సమాచార సేకరణకే రూ. 1.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీరే పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యత చూసుకునేలా ఆదేశాలిచ్చారు. అయితే పార్టీలో కొంత మంది ముఖ్య నేతలకు ఇది నచ్చడం లేదు. తమను కాదని బూత్‌ కన్వీనర్లకు ప్రాధాన్యత ఇవ్వడం మింగుడు పడటం లేదు. ఎన్నికల్లో తామేంటో చూపిస్తామంటున్నారు.

జనసేనకు అంత ప్రాధాన్యతా?
జనసేన, టీడీపీ పొత్తు ప్రకటన నేపథ్యంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... జనసేన నాయకులను పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే జనసేన నేతలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ ముఖ్య నేతలకు నచ్చడం లేదు. పార్టీ కోసం తాము ఇన్నాళ్లు కష్ట పడితే పట్టించుకోని బాలకృష్ణ... జనసేన నేతలను మాత్రం కూర్చోబెట్టి సత్కారాలు చేయడం మింగుడు పడటం లేదు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాక!
ఈసారి ఎలాగైనా హిందూపురంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వారం రోజుల పాటు నియోజకవర్గంలోనే పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. అందుకు అనుగుణంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పంచాయతీలోనూ నాయకులు, కార్యకర్తలను కలుస్తూనే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ఈ ఎన్నికల్లో హిందూపురంపై జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా హిందూపురంలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి పుంజుకుంది.

>
మరిన్ని వార్తలు