ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు

12 Nov, 2023 01:10 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సూర్యాపేట క్రైం : ఎన్నికలకు జిల్లాలో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. ఎన్నికల్లో పోలీస్‌ బందోబస్తు నిర్వహణ, యాక్షన్‌ ప్లాన్‌పై శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఓటర్లకు రక్షణ కల్పించడం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా అమలు చేయడం పోలీసు ముఖ్య విధి అని అన్నారు. సిబ్బంది ఎన్నికల డ్యూటీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒత్తిడి లేకుండా పని చేయాలని, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యమైన ప్రతి అధికారితో సమన్వయంగా పని చేయాలని సూచించారు. పారామిలిటరీ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించాలన్నారు. ఎన్నికల అధికారి అనుమతి లేనివారిని, గుర్తింపు లేని వారిని పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించవద్దని సూచించారు. ఎన్నికల ముందు రోజు నుంచి స్థానికేతరులు గ్రామాల్లో సంచరించకుండా ముందస్తు నిఘా ఉంచాలని, పోలింగ్‌ బూత్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చెక్‌ చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన పౌరులపై కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు, ఓటర్లు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీలు నాగభూషణం, ప్రకాష్‌, రవి, శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, ఎలక్షన్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌, సీఐలు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ రాహుల్‌హెగ్డే

మరిన్ని వార్తలు