మేజర్‌కు నివాళులు

18 Mar, 2023 01:24 IST|Sakshi
జయంత్‌ (ఫైల్‌)
● స్వగ్రామానికి భౌతికకాయం ● నేడు అంత్యక్రియలు ● సీఎం స్టాలిన్‌ సంతాపం

సాక్షి, చైన్నె:హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన మేజర్‌ జయంత్‌ తమిళనాడు వాసి కావడంతో స్వగ్రామం విషాదంలో మునిగింది. అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి శుక్రవారం రాత్రి ఆయన భౌతికకాయాన్ని తేని జిల్లా జయమంగలంకు తీసుకొచ్చారు. శనివారం ఆర్మీ లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో గురువారం ఉదయం ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. చివరకు అందులో ఉన్న ఇద్దరు మరణించినట్టు ఆర్మీ వర్గాలు నిర్ధారించాయి. ఈ హెలికాప్టర్‌లో మేజర్‌ జయంత్‌(30) ఉన్న సమాచారం వెలుగులోకి రావడంతో తమిళానాడులోని ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

స్వగ్రామానికి....

తేని జిల్లా దేవదానం పట్టి సమీపంలోని జయమంగళం వీవోసి వీధికి చెందిన ఆర్ముగం, మల్లి దంపతుల కుమారుడు జయంత్‌(30), పదేళ్లుగా ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య చెల్ల సారధి శ్రీ ఉన్నారు. ఈ ప్రమాదంలో జయంత్‌ మరణ సమాచారంతో జయ మంగళం గ్రామం శోకసంద్రంలో మునిగింది. మదురైలో ఉన్న జయంత్‌ భార్య స్వగ్రామానికి చేరుకుంది. ఆమెను ఓదార్చేందుకు కుటుంబీకులు తీవ్ర ప్రయత్నం చేశారు. జయంత్‌ పార్థివదేహాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి విమానంలో మదురైకు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో మదురై జిల్లా యంత్రాంగం జయంత్‌ భౌతికకాయానికి నివాళులర్పించింది. అనంతరం రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆప్తుల సందర్శనార్థం భౌతికకాయన్ని ఉంచారు. శనివారం ఉదయం ఆర్మీ లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. జయంత్‌ మరణ సమాచారంతో సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రుల బృందాన్ని అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు