తెలుగు సంవత్సరాదికి స్వాగతం

22 Mar, 2023 01:20 IST|Sakshi
ఉగాది వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు

కొరుక్కుపేట: షడ్రుచుల మేళవింపుతో కూడిన శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర తెలుగు ఉగాది పండుగకు విద్యార్థినులు స్వాగతం పలికారు. మంగళవారం కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో ఉగాది వేడుకలను కళాశాల ఆవరణలో వైభవంగా జరుపుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఉట్టిపడే రీతిలో సాగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు కనువిందు చేసే రంగోలీలు ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్‌ శరత్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహనశ్రీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వనీత, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ డా.నప్పిన్నై తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ మైథిలి పాల్గొన్నారు.

తెలుగు శాఖలో ఉగాది వేడుకలు

కొరుక్కుపేట: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో శోభకృత్‌ ఉగాది వేడుకలు ఎంతో విశిష్టంగా నిర్వహించారు. ప్రారంభ సమావేశం జరిగింది. తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలకగా, సభాధ్యక్షులుగా శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగను తెలుగు వారి సమక్షంలో తెలుగుశాఖలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అందరికి శోభకృత్‌ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనచంద్ర ఉగాది పర్వదినం తెలుగువారికి ప్రత్యేకమైదన్నారు. సమావేశంలో డా. నిర్మల ఉగాది విశిష్టతను తెలియజేశారు. డా. టి.ఆర్‌.ఎస్‌. శర్మగారు పంచాగ పఠనం గావించారు. అనంతరం జానపద గీతావిష్కరణ కార్యక్రమం జరిగింది. సిలక ఎందుకే అలకశ్రీ (దృశ్యరూపం) కావ్యాన్ని భువనచంద్ర ఆవిష్కరించారు. ఈ గీతాన్ని రచించి గానం చేసిన శేషు శింగరకొండను అభినందించారు.అనంతరం మరో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. భువనచంద్ర చేతులమీదుగా శ్లోకసప్తశతి (సుప్రసిద్ధ సంస్కృత శ్లోక సంకలనం) పుస్తకాన్ని ఆవిష్కరించారు.శోభారాజ తొలిప్రతిని స్వీకరించారు. పుస్తకాన్ని సమీక్ష డాక్టర్‌. కాసల నాగభూషణం చేశారు. డాక్టర్‌ సి.ఎం.కె. రెడ్డి పాల్గొని అతిథులను సన్మానించారు. విశిష్ట అతిథిగా ఎ.కె. గంగాధరరెడ్డి పాల్గొన్నారు .మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తరపున ఉగాది పురష్కారాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యులు గంపా వెంకటరామయ్య కు అందించారు. ఆనంద లహరి (సంగీత కార్యక్రమం) కార్యక్రమంలో జోస్యుల ఉమ ,జోస్యుల శైలేష్‌ఎంతో చక్కటి శాసీ్త్రయ సంగీతాన్ని శ్రీహరి గారి వాద్య సహకారంతో శ్రోతలకు వీనుల విందును అందించారు.చివరగా ఉగాది కవిసమ్మేళన సభకు ఎస్‌. శశికళ స్వాగతం పలకగా జె.కె.రెడ్డి, కాకాని వీరయ్య, గుడిమెట్ల చెన్నయ్య, ఆవుల వెంకటరమణ ఇలా 40 మంది ఉగాది కవితలను చదివారు. చివరగా డాక్టర్‌ మాదా శంకరబాబు, మన్నారు కోటీశ్వర్లు వందన సమర్పణతో శోభకృత్‌ ఉగాది వేడుకలు పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు