లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకండి

22 Nov, 2023 00:38 IST|Sakshi
సమావేశానికి హాజరైన నేతలు

సాక్షి, చైన్నె: లోక్‌సభ ఎన్నికల పనులకు పార్టీ వర్గాలు సిద్ధం కావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి పిలుపు నిచ్చారు. బూత్‌ కమిటీల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజల్లోకి మమేకమయ్యే విధంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం మంగళవారం సాయంత్రం రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌మాళిగైలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పళణి స్వామికి పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. దివంగత నేతల ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు, చిత్ర పటాలకు నివాళులర్పించినానంతరం సమావేశానికి పళణి స్వామి వెళ్లారు. సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల కార్యదర్శులు, కొత్తగా నియమితులైన వారు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ముందుగా జిల్లాల వారీగా పార్టీ తరపున చేపట్టాల్సిన కా ర్యక్రమాలు, బూత్‌ కమిటీల ఏర్పాటు గురించి చర్చించారు. బూత్‌ కమిటీల ఏర్పాటు మరింత వేగవంతానికి చర్యలు తీసుకోవాలని జిల్లాల కార్యదర్శులను పళణి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతం కావాలని, బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి బంధం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. మైనారిటీలకు మద్దతుగా ఆది నుంచి అన్నాడీఎంకే చేస్తూ వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వివరిస్తూ వారి మద్దతను కూడగట్టుకునే ప్రయత్నాలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలలోని ముఖ్య నగరాలు, పట్టణాలలో డీఎంకే ప్రజా వ్యతిరేక విధానాలు, మాయాజాలం ప్రజలకు వివరించే విధంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీ తో తెగ తెంపుల నేపథ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనేందు విధంగా ధైర్యంగా ముందుకెళ్దామని పార్టీ వర్గాలకు పళని పిలుపు నిచ్చినట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇందులో కూటమి గురించి కొందరు, కేసుల నేపథ్యంలో కేంద్రం రూపంలో తమకు ఎదురయ్యే ఇబ్బందులను మరి కొందరు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌, కోశాధికారి దిండుగల్‌ శ్రీనివాసన్‌, సీనియర్‌ నేతలు మునుస్వామి, ఎస్పీ వేలుమణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు