నిఘా.. కట్టుదిట్టం!

22 Nov, 2023 00:38 IST|Sakshi
● తీవ్రవాద నిరోధక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ● రూ. 60 కోట్ల నిధులు కేటాయింపు

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తుల కదలికలపై అధికారులు మరింత నిఘా పెట్టనున్నారు. ఇందుకోసం తీవ్రవాద నిరోధక విభాగం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విభాగానికి రూ. 60 కోట్ల నిధులను కేటాయించింది. వివరాలు.. రాష్ట్రంలో కొన్ని నగరాలు తీవ్రవాదులు హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు గతంలో వెలుగు చూసింది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ సమయంలో కోయంబత్తూరులో కారు పేలుడు ఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఆ తదుపరి పరిణామాలతో రాష్ట్రంలో నిషేధిత సంస్థల సానుభూతిపరులు చాప కింద నీరులా సాగిస్తున్న వ్యవహారాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగే వరకు కొన్ని నిషేధిత వ్యవహారాలు రాష్ట్ర పోలీసులు పసిగట్ట లేని పరిస్థితి నెలకొనింది. ఇందుకు అద్దం పట్టే విధంగా అనేక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో తీవ్రవాద నిరోధక విభాగం ఏర్పాటు కు సీఎం స్టాలిన్‌ ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా చేసిన ఈ ప్రకటనను కార్యరూపంలోకి తెచ్చే విధంగా కార్యచరణ సిద్ధం చేశారు. డీజీపీ శంకర్‌ జివ్వాల్‌, అదనపు డీజీపీ అరుణ్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ సెంథిల్‌ వేలన్‌, సీఎస్‌ శివదాస్‌ మీన, హోంశాఖ కార్యదర్శి అముదాలు పలుమార్లు ఈ విభాగం ఏర్పాటు గురించి చర్చించారు. లాకి అభిప్రాయాలను స్వీకరించారు.

కొత్త విభాగం ఏర్పాటు జీఓ..

తీవ్రవాద నిరోధక విభాగం (యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌)ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ పర్యవేక్షణలో ఈ విభాగం కొనసాగనుంది. ఇప్పటికే ఈ విభాగం ఏర్పాటు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో పరిపాలనా వ్యవహారాల కోసం రూ. 60.12 కోట్లను కేటాయించారు. ఇందులో 383 మంది సిబ్బంది ఉంటారు. డీఐజీ, ఐదుగురు ఏడీఎస్పీ, 13 డీఎస్పీ, 31 మంది ఇన్‌స్పెక్టర్‌, 61 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు, ఇతర సిబ్బందితో ఈ విభాగం ఏర్పాటు చేశారు. దీనికి క్రైంబ్రాంచ్‌ – క్రైం ఇన్వెస్టిగేషన్‌ విభాగం(సీబీసీఐడీ)కు ఉన్న అధికారాలు కల్పించడమే కాకుండా, స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలు అప్పగించారు. ఈ విభాగం అరెస్టు చేసే వారిని పోలీసు సెక్షన్లలోని అంశాల మేరకు ఆయా స్టేషన్లలోనే విచారణ చేపట్టేందుకు వీలు కల్పించారు. ఈ విభాగానికి అవసరమైన ఆధునిక పరికరాల కొనుగోలు, వాహనాలు, భవనాలు, సమాచార వ్యవస్థ తదితర వాటికి రూ. 26 కోట్లను వెచ్చించేందుకు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు