13 జిల్లాల్లో ముసురు వర్షాలు

22 Nov, 2023 00:38 IST|Sakshi
సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌

సాక్షి,చైన్నె: రాష్ట్రంలో పలు జిల్లాలో ముసురు వర్షం కురుస్తోంది. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. గత రెండురోజులుగా రాష్ట్రంలో మళ్లీ ఈశాన్య రుతు పవనాలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం, కన్యాకుమారి తీరంలో మరో ఉపరితల ఆవర్తనం వెరసి పలు జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. బుధవారం నుంచి వర్షాల తీవ్రత మరింతగా పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో మంగళవారం వేకువజాము నుంచి వర్షాలు పడుతున్నాయి. 16 జిల్లాల్లో వర్షాలు తెరపించి తెరపించి పడుతున్నాయి. ఇది మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలిలో అయితే మరింతగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నెలో రాత్రాంతా వర్షం పడింది. ఈ వర్షాలు మరింతగా కొనసాగే అవకాశాలతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన ముందు జాగ్రత్తలపై చర్చించారు. మరింత అప్రమత్తంగా ఉండదాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలో సాధారణం కంటే 80 శాతం అధికంగా వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు