ఈటల భద్రతపై కేటీఆర్‌ ఆరా.. రంగంలోకి సీనియర్‌ ఐపీఎస్‌

28 Jun, 2023 11:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌పై ఈటల జమున మండిపడ్డారు. 

మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్‌ భద్రతపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ చేశారు. ఈటల భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్‌ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్‌ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్‌ ఐపీఎస్‌ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్‌ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ  హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్‌ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్‌ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు