తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: ఆ ఛాన్స్‌ నాకు దక్కింది.. రైతు బంధు కేంద్రం కళ్లు తెరిపించింది

2 Jun, 2023 12:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పాల్గొన్నారు. గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. సచివాలయం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర  దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించి.. అక్కడి సభా వేదిక నుంచి ప్రసంగించారాయన.

తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది.  శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది.  దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

🎤 తెలంగాణపథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మన సంక్షేమ మోడల్‌ను కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఏ పథకం తెచ్చినా అందులో మానవీయ కోణమే ఉంటుంది.

🎤 రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవా కానుకగా..  బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. 

🎤 పోడు భూముల శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నాం. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు చేపట్టబోతున్నాం.  

🎤 గొల్ల, కుర్మలకు భారీ ఎత్తున్న గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో విడుత పంపిణీ చేయబోతున్నాం.

🎤 గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అర్హులైన వాళ్‌లకు ఇళ్ల స్థలాలు అందిస్తాం. గృహలక్ష్మి పథకం ఒక్కో ఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 

🎤 దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇస్తున్నాం. హుజూరాబాద్‌లో వందకు వంద శాతం ఈ పథకం అమలు అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 50 వేలమందికి దళిత బంధు లబ్ధి చేకూరింది.

🎤 మిషన్‌ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించాం. చెరువుల కింద పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. 

🎤 ఇవాళ తెలంగాణలో కరెంట్‌ కోతలు లేవు.. అన్నీ వరి కోతలే

🎤 గ్రామీణఆర్థిక వ్యవస్థను బలపరిచాం. మన పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డు వస్తున్నాయి. 

🎤 ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అవార్డులు మిషన్‌ భగీరథకు వచ్చాయి.స్వరాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్‌ సమస్యలు లేవు.

🎤 నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశాం. కాళేశ్వరంను అతితక్కువ కాలంలో పూర్తి చేశాం. 

🎤 రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా కళ్లు తెరిపించింది.

🎤 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది.

🎤 పవర్‌ హాలీడేతో పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. మోదీ స్వరాష్ట్రంలోనూ పవర్‌ హాలీడే అమలు అవుతోంది. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు.

మరిన్ని వార్తలు