బంజారాహిల్స్‌: డబ్బు తీసుకురాకపోతే చంపేస్తా..  

1 Nov, 2021 10:31 IST|Sakshi

13 ఏళ్ల బాలుడిని బెదిరించిన సహచర విద్యార్థి

సాక్షి, బంజారాహిల్స్‌: డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ తన స్నేహితుడు బెదిరించడంతో తల్లిదండ్రులకు తెలియకుండా ఓ 13 ఏళ్ల బాలుడు తన ఇంట్లో నుంచి రూ. లక్ష తస్కరించి స్నేహితుడికి ఇచ్చాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10లోని జహీరానగర్‌లో నివసించే మహ్మద్‌ నిజాముద్దీన్‌ కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అలమారాలో కొంత నగదును ఉంచారు. గురువారం అలమారా తెరిచి చూడగా అందులో రూ. లక్ష నగదు కనిపించలేదు.
చదవండి: ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు..

దీంతో 7వ తరగతి చదువుతున్న తన 13 ఏళ్ల కొడుకును గట్టిగా ప్రశ్నించారు. కొంతకాలంగా తన క్లాస్‌మేట్‌ (13) డబ్బులకోసం వేధిస్తున్నాడని, డబ్బు తీసుకురాకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పాడు. భయపడి అలమారాలో నుంచి రూ. లక్ష తీసి ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జువైనల్‌ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: కిరాణం షాప్‌కు వెళ్తున్నానని చెప్పి..సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్‌ చేసి..

మరిన్ని వార్తలు