మూడు జిల్లాల్లో జూట్‌ పరిశ్రమలు

18 Sep, 2021 01:34 IST|Sakshi

రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మూడు కంపెనీలు 

10 వేల నాలుగు వందల ఉద్యోగాల కల్పనకు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్‌ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ కంపెనీలు అంగీకరించి శుక్రవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వరంగల్‌ జిల్లాలో గ్లోస్టర్‌ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్‌ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి.

ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 వేల నాలుగు వందల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు ఐటీ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. కేటీఆర్‌ మట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు జూట్‌ పరిశ్రమ లేదని, ఈ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూట్‌ పరిశ్రమలకు అవసరమైన జనపనార పంట పండించడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ మూడు పరిశ్రమలతోపాటు మరిన్ని యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. 

జనపనార పంటలకు ప్రోత్సాహం 
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జనపనార పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని, ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 3.20 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగిందని చెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచే రూ. 49.26 నుంచి రూ. 61.78కి ఒక్కో గన్నీ బ్యాగును సేకరిస్తున్నామని, ట్రాన్స్‌పోర్ట్‌ కోసం రూ. 2.36 వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

కొత్త జూట్‌ మిల్లుల ఏర్పాటుతో రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు నిధుల ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. గన్నీలతోపాటు కూరగాయల బ్యాగులు, చేసంచులు, ఇతర ఉత్పత్తుల వల్ల మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని సైతం అరికట్టి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని అన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు