-

8 కిలోల బంగారం దుస్తుల్లో  దాచేశారు..

13 Aug, 2023 02:20 IST|Sakshi

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టివేత 

నలుగురు ప్రయాణికుల నుంచి స్వాధీనం 

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న  8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడు ప్యాంటులో దాచి తీసుకొచ్చిన 2 కేజీల బంగారం బిస్కెట్‌ ముక్కలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.21 కోట్లు ఉంటుందని నిర్ధారించారు.

అదే విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడు కూడా లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 1.75 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 1.8 కోట్లుగా నిర్ధారించారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద లో దుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 2.17 కేజీల బంగారం పేస్టును బయటికి తీశారు. దీని విలువ 1.31 కోట్లుగా నిర్ధారించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి ధరించిన లో దుస్తుల్లో 2.05 కేజీల బంగారం బయటపడింది. దీని 1.24 కోట్లుగా నిర్ధారించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పట్టుబడిన  8 కేజీల బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒకే రోజులో అత్యధికంగా పట్టుబడిన బంగారం ఇదేనని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు