90 వేలు దాటిన కరోనా కేసులు 

16 Aug, 2020 04:50 IST|Sakshi

ఇప్పటివరకు 7.32 లక్షల నిర్ధారణ పరీక్షలు 

కోలుకున్నవారు 66,196.. మొత్తం మరణాలు 684 

తాజాగా 1,863 కేసులు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు 7,32,435 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 90,259 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా శుక్రవారం (14వ తేదీ) 21,239 పరీక్షలు నిర్వహించగా, 1,863 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 664 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. తాజాగా కరోనాతో 10 మంది మృతి చెందారు. 1,912 మంది కోలుకున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 394, మేడ్చల్‌ 175, రంగారెడ్డి 131, కరీంనగర్‌ జిల్లాలో 104, వరంగల్‌ అర్బన్‌ 101, సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో 61 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 684 మంది మరణించగా, 66,196 మంది కోలుకున్నారు. దేశంలో మరణాల రేటు 1.95 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.75 శాతంగా ఉంది. కోలుకున్నవారి రేటు దేశంలో 71.16 శాతం, తెలంగాణలో 73.34 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 23,379 ఉండగా, వాటిల్లో 16,221 మంది హోం, వివిధ సంస్థలకు సంబంధించిన ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 19,728 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు