సివిల్, మెకానికల్‌ కోర్సులకు రిపేర్‌ 

8 Nov, 2022 01:38 IST|Sakshi

మార్కెట్‌ అవసరాలు తీర్చేలా మార్పులు 

కాయకల్ప చికిత్సకు ఏఐసీటీఈ ప్రయత్నం 

కోర్సులకు టెక్నాలజీ జోడించాలని నిర్ణయం 

కంప్యూటర్‌ కోర్సులతో పోటీ పడొచ్చని అంచనా 

అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయ సేకరణ 

సాక్షి, హైదరాబాద్‌: నానాటికీ ఆదరణ కోల్పోతున్న ఇంజనీరింగ్‌లోని కొన్ని కోర్సులకు కాయకల్ప చికిత్స చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సిద్ధమైంది. అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సుల స్వరూపాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల అభిప్రాయాలు కోరింది.

దీని ఆధారంగా ముసాయిదా ప్రతిని రూపొందించే ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 12,70,482 సీట్లు ఉంటే, ఏటా సగటున 9.5 లక్షల మంది చేరుతున్నారు. ఇందులో 6.2 లక్షల మంది కంప్యూటర్, ఐటీ కోర్సులనే ఎంచుకుంటున్నారు. సివిల్‌లో 30 శాతం, మెకానికల్‌లో 28 శాతం, ఎలక్ట్రికల్‌లో 32 శాతం మించి సీట్లు భర్తీ కావడం లేదు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే డిమాండ్‌ లేని బ్రాంచ్‌లుగా ఇవి మూతపడే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలూ భావిస్తున్నాయి.  

మార్కెట్‌ స్పీడేది? 
వాస్తవానికి దేశవ్యాప్తంగా నిర్మాణ, మోటార్, విద్యుత్‌ రంగాల్లో ఊహించని పురోగతి కన్పిస్తోంది. వీటికి సంబంధించిన నైపుణ్యం గల కోర్సులు మాత్రం డిమాండ్‌ కోల్పోతున్నాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పులు సంబంధిత కోర్సుల్లో జోడించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఏఐసీటీఈ అధ్యయనంలో వెల్లడైంది. ఉదాహరణకు నిర్మాణ రంగంలో అనేక మార్పులొచ్చాయి.

ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణంలో సాఫ్ట్‌వేర్‌తో ప్లానింగ్‌ రూపకల్పన చేస్తున్నారు. రిమోట్‌ కంట్రోల్‌ వ్యవస్థతో నడిచే యంత్రాలు రంగప్రవేశం చేశాయి. కానీ చదువు ముగించుకుని ఉపాధి కోసం వచ్చే విద్యార్థులు ఈ వేగాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. సాంకేతికత తోడవ్వని రీతిలోనే ఇంజనీరింగ్‌ పట్టా తీసుకోవడంతో పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. వాహన రంగాన్ని ఆధునిక టెక్నాలజీ పూర్తిగా ఆక్రమించింది. స్మార్ట్‌ టెక్నాలజీతోనే వాహనాలను డిజైన్‌ చేస్తున్నారు. మెకానికల్‌ ఇంజనీర్లు అనుభవంలో తప్ప ఈ టెక్నాలజీని విద్యార్థి దశలో పొందలేకపోతున్నారు. అదేవిధంగా విద్యుత్‌ ప్రాజెక్టుల్లోనూ టెక్నాలజీ దూసుకొస్తున్నా, ఇంజనీరింగ్‌లో ఇంకా పాతకాలం బోధనే కొనసాగుతోంది. 

పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం 
సాధారణ సివిల్, మెకానికల్‌ కోర్సుల్లో మార్కెట్లో ఉన్న టెక్నాలజీని జోడించే దిశగా కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. రెండో ఏడాది నుంచి కంప్యూటర్‌ అనుసంధాన కోర్సులు, సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. పారిశ్రామిక సంస్థలతో నేరుగా అనుభవం పొందేలా బోధన ఉండాలని ఏఐసీటీఈ ప్రతిపాదిస్తోంది. మెకానికల్‌లో సాధారణ పాఠ్య ప్రణాళికను బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌గానే ఉంచి, మార్కెట్లో వస్తున్న మార్పులతో కూడిన సాంకేతికతను ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించింది. ఇదేవిధంగా ఎలక్ట్రికల్‌ కోర్సుల్లోనూ మార్పులు ప్రతిపాదిస్తోంది.

దీనిపై అన్ని కాలేజీలు మౌలిక వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతీ కాలేజీ కూడా పారిశ్రామిక సంస్థలతో అనుసంధానమై ఉండేలా నిబంధనలు తేవాలని, అప్పుడే కోర్సులు ఆదరణ పొందుతాయని భావిస్తోంది. వాస్తవానికి ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ముసాయిదా పూర్తయితే, ఏఐసీటీఈ కార్యాచరణకు ఉపక్రమించే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.  

మరిన్ని వార్తలు