లైసెన్స్‌ పునరుద్ధరణా? చలో ఆన్‌లైన్

3 Sep, 2020 05:54 IST|Sakshi

ఆర్టీఏలో మరో ఆరు సేవలు ఆన్‌లైన్‌తో అనుసంధానం 

సాక్షి, హైదరాబాద్‌: రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్‌ (హజార్డస్‌ లైసెన్స్‌) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్‌ లైసెన్స్‌ పొందటం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్‌ లైసెన్స్‌ జారీ తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. (కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి)

జూన్‌ 24న, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్, పాత లైసెన్స్‌ కార్డు స్థానంలో స్మార్ట్‌కార్డు పొందటం, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి మంచి స్పందన వస్తోందని, సేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఐదు సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందు బాటులో ఉండేవని, ఇప్పుడు వాటికి అదనంగా మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వాహనదారులు జాప్యం లేకుండా సేవలు పొందే వీలు కలుగుతుందని తెలిపారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్‌)

మరిన్ని వార్తలు