కనకారెడ్డికి పునర్జన్మ

16 Feb, 2021 03:22 IST|Sakshi
మీడియా సమావేశంలో డాక్టర్‌ హరిప్రసాద్, అనిల్‌కుమార్, కనకారెడ్డి, ఎన్వీఎస్‌ రెడ్డి, గోపాల కృష్ణ గోఖలే 

అరుదైన శస్త్రచికిత్స తరువాత కోలుకున్న బాధితుడు 

ఈ నెల 2న గ్రీన్‌చానెల్‌ సాయంతో గుండె మార్పిడి

సాక్షి, హైదరాబాద్‌: అవయవమార్పిడి ద్వారా గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్న కనకారెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఈ నెల 2న గ్రీన్‌ చానెల్‌ సాయంతో ఎల్‌బీ నగర్‌ కామినేనిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన దాత గుండెను తెచ్చి మరో వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ చేసిన డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సోమవారం మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్‌ ద్వారా అవయవాలను తరలించడం ప్రపంచంలో ఇదే మొదటిసారన్నారు. 8గంటల పాటు గుండె మార్పిడి జరిగిందని, ప్రస్తుతం కనకారెడ్డి ఆరోగ్యంగా ఉన్నా రని తెలిపారు. ఈ సర్జరీ జరగడానికి జీవన్‌దాత ఆర్గనైజేషన్‌ ఎంతో కృషి చేసిందన్నారు. ఇలాంటి సర్జరీల్లో 75శాతమే సక్సెస్‌ రేటు ఉంటుందని, ఇప్పటి వరకు నగరంలో 60 ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీలు జరగ్గా అందులో 42 అపోలో హాస్పిటల్‌లోనే జరిగా యన్నారు.

అవయవదానం చేసిన రైతు నర్సిరెడ్డి కుటుంబానికి తగిన సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గోఖలే కోరారు. నగర ట్రాఫిక్‌ పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ... గత సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో 25 సార్లు గ్రీన్‌ చానెల్‌ను ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లోనూ పోలీస్‌ వ్యవస్థ నుంచి సహకారం అందిస్తా మన్నారు. చికిత్స జరిగిన 2 రోజుల వరకు తనకు ఏ విషయం తెలియదని, దేవుడిలా డాక్టర్లు తనకు పునర్జన్మనిచ్చారని కనకారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గుండె దానం చేసిన రైతు కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో అపోలో గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.హరిప్రసాద్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో సీఈవో అనిల్‌కుమార్, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన అపోలో బృందం పాల్గొన్నారు.

చదవండి: (హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు)

మరిన్ని వార్తలు