పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం

6 Jan, 2021 02:07 IST|Sakshi

350కు పైగా పక్షి జాతులకు నెలవుగా రాష్ట్రం

హైదరాబాద్, దాని చుట్టుపక్కలే 270 వరకు రకాలు

తాజాగా అనంతగిరిలో అరుదైన ‘బ్లూ అండ్‌ వైట్‌ ఫ్లై క్యాచర్‌’ దర్శనం

పక్షుల మనుగడ, పరిరక్షణ విషయంలో మెరుగైన స్థితి: ‘బర్డింగ్‌పాల్స్‌’ హరికృష్ణ

పాలినెటర్స్‌ పార్క్స్‌ ఏర్పాటుతో మేలు: బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్‌ సాయిలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతిలో ఎన్నో ప్రాణులున్నా పక్షులది ప్రత్యేక గుర్తింపు.. ఎన్నో రకాలు.. ఎన్నో రంగులు.. మరెన్నో రాగాలు.. రాష్ట్రంలో వివిధ రకాల పక్షులు కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం మెరుగైన జీవవైవిధ్యం, చెట్లు, పూల మొక్కలు, పక్షులు, జంతుజాలంతో రాష్ట్రం విలసిల్లుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 350కు పైగా పక్షుల రకాలు ఉన్నట్టుగా పర్యావరణ, పక్షుల ప్రేమికులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌.. దాని చుట్టుపక్కలే 270 దాకా వివిధ రకాల పక్షులుంటాయని చెబుతున్నారు. తాజాగా వికారాబాద్‌ అనంతగిరిలో దేశంలోనే అరుదైన ‘బ్లూ అండ్‌ వైట్‌ ఫ్లై క్యాచర్‌’ పక్షి కనిపించడం విశేషం. గత 30 ఏళ్ల కాలంలో ఇది తెలంగాణలోనే కనిపించలేదని, ఇప్పుడు కనిపించడాన్ని బట్టి మెరుగైన ఎకో సిస్టమ్‌తో పాటు జీవవైవిధ్యం బాగా ఉన్నట్టుగా, పక్షులు స్వేచ్ఛగా తమ జీవక్రియలను కొనసాగించేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టుగా భావించవచ్చని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు.

జనవరి 5వ తేదీని ‘నేషనల్‌ బర్డ్‌ డే’గా అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అమెరికాలో దీనిని ఒక ఉద్యమంగా ఒక కార్యాచరణ మాదిరిగా నిర్వహిస్తున్నారు. బర్డ్‌వాచింగ్, పక్షులపై అధ్యయనం, బర్డ్‌ యాక్టివిటీస్‌ పర్యవేక్షణ, పక్షులను దత్తత తీసుకోవడం అనేవి ‘నేషనల్‌ బర్డ్‌ డే’ యాక్టివిటీగా దాదాపు 5 లక్షల మంది వరకు నిర్వహిస్తుండటం విశేషం. యూఎస్‌లో ‘యాన్యువల్‌ క్రిస్మస్‌ బర్డ్‌ కౌంట్‌’లో భాగంగా దీనిని కూడా నిర్వహిస్తా రు. తమ దేశంలోని పక్షుల పురోభివృద్ధి, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు సిటిజన్‌ సైన్స్‌ సర్వే మాదిరిగా చేపడుతున్నారు. పదేళ్ల కింద నుంచే నేషనల్‌ బర్డ్‌ డేను నిర్వహిస్తుండగా, భారత్‌లో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్‌లోనూ జనవరి 5న నేషనల్‌ బర్డ్‌ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

లాక్‌డౌన్, వానలతో మేలు..
‘తెలంగాణలో పక్షి జాతులు, రకాల సంతతి బాగానే వృద్ధి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అలాగే హైదరాబాద్, చుట్టుపక్కల వివిధ రకాల పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సాధారణంగానే పక్షుల మనుగడ, పరిరక్షణ విషయంలో మన రాష్ట్రం మెరుగైన స్థితిలోనే ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్, ఆ తర్వాత వర్షం సీజన్‌ బాగా ఉండటం మనకు ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా పర్యావరణానికి, అడవులు, జంతువులు, పశుపక్ష్యాదులకు మంచి జరిగింది. ప్రస్తుత సీజన్‌లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు, పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లతో బర్డ్‌ ఫ్లూ వ్యాపించే అవకాశాలున్నాయి. అయితే దీని పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ సంస్థ అధ్యక్షుడు

పాలినేటర్స్‌ పార్కులు పెట్టాలి..
‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్‌ పార్కులను పెడుతున్న విధంగానే ‘పాలినేటర్స్‌ పార్కు’లను కూడా ఏర్పాటు చేయాలి. కనీసం జిల్లాకో పార్క్‌ పెట్టాలి. తెలంగాణకు ప్రత్యేకమైన, స్థానిక మొక్కలు, పండ్ల మొక్కలను వాటిలో పెంచితే పక్షులు వాటిని తిన్నాక ఇతర ప్రాంతాల్లో వాటి డ్రాపింగ్స్‌ ద్వారా ఈ మొక్కలు పెరుగుతాయి. అదే ఎగ్జోటిక్, ఇన్వెసివ్‌ ప్లాంట్లను పెట్టడం వల్ల మనుషులు, పక్షులకు ఎలర్జీలు ఏర్పడుతున్నాయి. నేటివ్‌ ప్లాంట్స్‌ ఎకోసిస్టమ్‌ను పెంచడానికి, జీవవైవిధ్యం మరింత మెరుగుపడేందుకు పాలినేటర్స్‌ పార్కులు దోహదపడతాయి. వీటి వల్ల పక్షుల సంఖ్య కూడా పెరుగుతుంది. బర్డ్‌ ఫ్లూ కేసులు, కొత్త వైరస్‌ బయటపడిన నేపథ్యంలో ఎక్కడైనా చనిపోయిన పక్షులు కనిపిస్తే వాటి గురించి అటవీ, వెటర్నరీ అధికారులకు తెలియజేస్తే వాటిని సేఫ్‌గా డిస్‌పోజ్‌ చేయవచ్చు. లేకపోతే చనిపోయిన పక్షుల వల్ల కూడా వైరస్‌ వ్యాపించే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి’ – గైని సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్, ఫారెస్ట్‌ 2.0 రీజినల్‌ డైరెక్టర్‌ 

జపాన్‌లో కనిపించే పక్షి
వికారాబాద్‌ జిల్లాలోని అడవిలో ఇటీవల మేము పర్యటిస్తున్న సందర్భంగా దేశంలోనే అత్యంత అరుదైన ‘బ్లూ అండ్‌ వైట్‌ ఫ్లై క్యాచర్‌’పక్షి తారసపడటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బ య్యాము. జపాన్, కొరియాలో ప్రధానంగా కనిపించే ఈ పక్షి, భారత్‌లోని  దక్కన్‌ పీఠభూమిలో కనిపించడాన్ని వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీరాంరెడ్డి తన కెమెరాలో బంధించాడు. అడవుల సంరక్షణతో పాటు జీవవైవిధ్యం మెరుగ్గా ఉంటే ప్రతీ ఏడాది ఈ పక్షి తెలంగాణలో కనిపించి కనువిందు చేస్తుంది. – గోపాలకృష్ణ, పక్షి ప్రేమికుడు 

మరిన్ని వార్తలు