20 రోజులు..  222 కిలోమీటర్లు

28 Nov, 2022 02:15 IST|Sakshi

నేటి నుంచి బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర

భైంసాలో ప్రారంభం... డిసెంబర్‌ 18న కరీంనగర్‌లో ముగింపు

ప్రారంభ సభకు రానున్న దేవేంద్ర ఫడ్నవీస్, ముగింపు సభకు నడ్డా

పాదయాత్ర రూట్‌లో స్థానిక టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల చేరికలపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్‌ జిల్లా భైంసాలో ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 18న కరీంనగర్‌లో ముగియనుంది. మొత్తం 20 రోజులపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో 222 కి.మీ మేర సాగనుంది. సంజయ్‌ సోమవారం ఉదయం నిర్మల్‌ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భైంసా నుంచి యాత్ర ప్రారంభిస్తారు. భైంసాలో నిర్వహించే ప్రారంభసభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌తోపాటు వివిధస్థాయిల నాయకులు బీజేపీలో చేరనున్నారు. ఈ యాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఇతర స్థానిక నాయకులు చేరతారని అంచనా వేస్తున్నారు. సంజయ్‌ తొలిరోజు పాదయాత్రలో 6.3 కి.మీ. నడిచి.. ముథోల్‌ నియోజకవర్గంలోని గుండగామ్‌ సమీపంలో రాత్రి బస చేస్తారు. ఈ యాత్రలో భాగంగా 8 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే సభలకు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయనేతలు పాల్గొంటారు. ముగింపుసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

పాదయాత్ర ఇలా...
29న రెండోరోజు గుండగామ్‌ నుంచి మహాగాన్‌ దాకా 13 కి.మీ; 30న లింబా నుంచి కుంటాల, అంబకంటి మీదుగా 13.7 కి.మీ; డిసెంబర్‌ 1న నిర్మల్‌లోని బామిని బూజుర్గ్‌ నుండి నందన్, నశీరాబాద్‌ మీదుగా 10.4 కి.మీ.; 2న రాంపూర్‌ నుంచి లోలమ్‌ మీదుగా చిట్యాల దాకా 11.1 కి.మీ; 3న చిట్యాల నుండి మంజులాపూర్, నిర్మల్‌ రోడ్, ఎడిగాం, ఎల్లపల్లి, కొండాపూర్‌ మీదుగా ముక్తాపూర్‌ వరకు 12.3 కి.మీ; 4న లక్మణ్‌ చందా మండలంలోని వెల్మల, రాచాపూర్, లక్మణ్‌ చందా, పోటపల్లి వరకు 12.7 కి.మీ; 5న మమ్డా మండలంలోని కొరైకల్‌ మమ్డా, దిమ్మతుర్తి వరకు 11.5 కి.మీ; 6న ఖానాపూర్‌ నియోజకవర్గంలో దొమ్మతుర్తి, ఇక్బాల్‌పూర్, తిమ్మాపూర్, ఖానాపూర్‌ మీదుగా 12.8 కి.మీ; 7న మస్కాపూర్‌ లోని సూరజ్‌ పూర్, బడాన్‌ ఖర్తి, ఓబులాపూర్, మొగల్‌ పేట మీదుగా 12.8 కి.మీ; 8, 9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో 21.7 కి.మీ; 10న కోరుట్ల పట్టణం వెంకటాపురం, మోహన్‌ రావు పేట మీదుగా 12.3 కి.మీ; 11న వేములవాడలోని మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా 10.1 కి.మీ; 12న జగిత్యాలలో 10.4 కి.మీ; 13న చొప్పదండిలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా 13.3 కి.మీ; 14, 15 తేదీల్లో చొప్పందండి నియోజకవర్గంలో 20 కి.మీ.; 16, 17న కరీంనగర్‌లో 18 కి.మీ. యాత్ర సాగనుంది. 18న కరీంనగర్‌లో ఎస్సారార్‌ కళాశాల వద్ద ముగింపు బహిరంగ సభ. 

ఈ విడతకు భారీగా ప్రజాస్పందన
బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర సాగనుంది. అదీగాక, ఈ విడత యాత్ర హిందుత్వ భావజాలం నేపథ్యమున్న ప్రాంతాల్లో జరగనుంది. అందుకే ఈ విడత యాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగిన నాలుగువిడతల కంటే ఈ విడత యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని భావిస్తున్నాం.  
    – పాదయాత్ర ప్రముఖ్‌ డా. గంగిడి మనోహర్‌రెడ్డి

మరిన్ని వార్తలు