సీఐ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌.. మహిళ అక్కడికక్కడే మృతి

1 Dec, 2023 16:41 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: అతి వేగంగా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. హైస్పీడ్‌తో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా, ఓ సీఐ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా నడిరోడ్డుపై ఓ మహిళ మృతిచెందింది. అయితే, ఉన్నతాధికారి కొడుకు నిందితుడు కావడంతో పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ వద్ద కవిత బైక్‌ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్‌లో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఎక్సైజ్‌ సీఐ శరత్‌ కొడుకు వంశీ TS03 FA9881 నెంబర్‌ కారును అధిక వేగంతో డ్రైవ్‌ చేసి రాంగ్‌ సైడ్‌లో బైక్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే మాట్లాడున్న కవితను కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. 

అయితే, ఈ ప్రమాదంలో నిందితుడి వంశీపై చర్యలు తీసుకోవాలని కవిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వంశీని ఈ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నాడు. దీంతో, నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్‌లో ధర్నా చేశారు. దీంతో, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక, కవితకు వివాహం కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు