అధికారంలోకి వచ్చాక ఎస్టీ రిజర్వేషన్లపైనే తొలి సంతకం 

10 Aug, 2021 01:47 IST|Sakshi

బీజేపీ నేత మురళీధర్‌రావు 

కవాడిగూడ: రాష్ట్రంలోబీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ల ఫైల్‌ మీద ఉంటుందని బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌ రావు చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై కొమురంభీం విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్లపై గిరిజనులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు.

దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపునిస్తామని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, గిరిజన ఐక్యవేదిక నేతలు వివేక్‌ నాయక్, డాక్టర్‌ హెచ్‌కె నాగు, సిదం అర్జున్, తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుతాడి కుమార్, లోనిక రాజు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు