సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా

9 Sep, 2023 05:28 IST|Sakshi
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న రఘునందన్‌రావు  

వరంగల్‌ పోలీసు కమిషనర్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌ సవాల్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ వర్సిటీ పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్‌ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్‌ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్‌ విసిరారు.

ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్‌ ఆఫీస్‌ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు.

ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్‌ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్‌డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా  12న వరంగల్‌ జిల్లా బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్‌ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్‌ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు