'ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది'

19 Dec, 2020 13:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ రామ్‌ మాధవ్‌ అన్నారు. ఇండియా- చైనా మధ్య వివాదం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అనే అంశంపై హోటల్‌ క్షత్రియాలో అవేర్‌నెస్‌ ఇన్‌ యాక్షన్‌ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత  రామ్‌ మాధవ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. కార్యక్రమంలో రామ్‌ మాధవ్‌ మాట్లాడుతూ.. 'చైనా మనకు రెండు విధాలుగా సవాల్‌ విసురుతోంది. ఒకటి ఆర్థికంగా ఎదిగిన చైనా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందుకే మన దేశంలాంటి దేశాలు అన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలి. అందుకే ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తున్నాం' అని తెలిపారు. 

ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. 'చైనా అనేక కుయుక్తులు పన్నుతోంది. పాకిస్తాన్‌తో ఏకమై పనిచేస్తూ ఆ దేశాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో లాబీయింగ్‌ చేస్తోంది. శ్రీలంకలో చైనా అనేక నిర్మాణాలు చేస్తోంది. ఇది భారతదేశానికి చాలా ఇబ్బంది కలిగించేదే. నేపాల్‌లో చైనా మధ్యవర్తిత్వంలో అక్కడి రాజకీయాల్లో మార్పు వస్తోంది. చైనా వల్ల ఇండియన్‌ ఓసియన్‌లో ఉన్న అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చైనా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. చదవండి: (ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌)

దేశ విస్తరణ కాంక్షతో చైనా ఇలా వ్యవహరిస్తోంది. భారతదేశం ఏనాడు టెరిటరీ బార్డర్‌ను పెంచుకోవాలని కోరుకోలేదు. చైనా యాప్‌ల బ్యాన్‌ ద్వారా మన దేశ యువకులకు మంచి అవకాశం వచ్చింది. చైనాను కమ్యూనిస్టు దేశం అనేందుకు ఏ దేశం ఇష్టపడటం లేదు. భారత్‌ ఎప్పుడూ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు. కానీ చైనా మన దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం​ చేస్తోంది. బీజేపీ ఎప్పుడూ స్నేహ హస్తం ఇస్తుంది. కవ్వింపులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. దేశ వ్యవహారాల్లో ఎవరి ప్రమేయం ఒప్పుకోం. నేపాల్‌ లాంటి దేశాలు చైనా వలలో పడకూడదు' అని కోరుకుంటున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు