కేసీఆర్‌కు కర్రు కాల్చి వాతపెట్టే రోజులొచ్చాయి: ఈటల ఫైర్‌

8 Aug, 2022 01:41 IST|Sakshi

సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్‌): బర్లు, గొర్లు కాసే వారికి కూడా కేసీఆర్‌ గురించి తెలిసిందని, ఆయన భాషలో చెప్పాలంటే కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులొచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ మాస పత్రిక ఆధ్వర్యంలో ‘రెవెన్యూ ఉద్యోగుల మనోధైర్యం.. భవిష్యత్‌ కార్యాచ రణ’అనే అంశంపై సదస్సు జరిగింది. 

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. భూమికి రక్షణగా ఉండే రెవెన్యూ శాఖ అన్ని శాఖలను సమన్వయం చేస్తుందని, అలాంటి శాఖను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వృత్తిపరమైన సంఘాలకు సచివాలయం లేదని, వారి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. పాలనలో రెవెన్యూ వ్యవస్థ కీలకమైందని, అలాంటి వ్యవస్థపైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. 

బీఆర్వోల సర్వీస్‌ రూల్స్‌కు తూట్లు పొడిచారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. సర్వీస్‌ను అంతం చేయటం అంటే వారి అస్థిత్వాన్ని దెబ్బతీయటమేనని అన్నారు. తెలంగాణ రెవెన్యూ మాస పత్రిక ఎడిటర్‌ వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ ఇందిరా శోభన్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కె.గోవర్ధన్, బీఎస్పీ నాయకులు దయాకర్‌ రావు, హర్షవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ ఆందోళనలో ఉన్నారు 

మరిన్ని వార్తలు