కాసేపట్లో పెళ్లి.. షాకిచ్చిన వధువు 

19 Aug, 2021 09:51 IST|Sakshi

అమ్రాబాద్‌: కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా..తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వధువు తేల్చి చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆపేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం వంకేశ్వరంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్‌ పూర్తి చేయగా..ఆమెకు వంకేశ్వరం గ్రామానికి చెందిన బద్రు అనే యువకుడితో ఇటీవల వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి బుధవారం ముహూర్తం నిర్ణయించారు. దీంతో పెళ్లికూతురు, ఆమె తరఫు బంధువులు వరుడు స్వగ్రామం వంకేశ్వరానికి చేరుకున్నారు.

కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో ఈ పెళ్లి ఇష్టం లేదని, తనకు బాగా చదువుకోవాలని ఉందని వధువు చెప్పడంతో అక్కడికి చేరుకున్న బంధువులు అ వాక్కయ్యారు. వధువుకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎంత సర్ది చెప్పినా ఆమె వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని ఆపేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూశారు.

మరిన్ని వార్తలు