పుట్టిన 24 గంటలకే బైపాస్‌ సర్జరీ 

27 Sep, 2023 02:28 IST|Sakshi

యూకే వైద్యుల ఆధ్వర్యంలో పసికందుకు నిమ్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స 

వైద్యులకు బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ప్రశంసలు 

లక్డీకాపూల్‌: గుండెలో రంధ్రంతో పుట్టిన ఒక రోజు వయసుగల ఆడశిశువుకు మంగళవారం నిమ్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. యూకేకు చెందిన ఆల్డర్‌ హే ఆస్పత్రి కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని వైద్య బృందం నిమ్స్‌ కార్డియోథిరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ. అమరేశ్‌రావు, పీడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌తో కలసి ఈ సర్జరీ చేపట్టింది. నిజామాబాద్‌ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన ప్రశాంత్‌ గ్రూప్‌–2 ప్రిపరేషన్‌ కోసం తన భార్య సమీర శ్రావణితో కలసి హైదరాబాద్‌ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాడు.

ఆయన భార్య సోమవారం ఉదయం ఆడశిశువు (సిజేరియన్‌ శస్త్రచికిత్స ద్వారా)కు జన్మనివ్వగా శిశువుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటికే గుండె సంబంధ జబ్బులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు చార్లెస్‌ హార్ట్‌ హీరోస్‌ పేరిట నిమ్స్‌లో యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని (ఈ నెల 24 మొదలు 30 వరకు) నిర్వహిస్తుండటంతో వారి ఆధ్వర్యంలో శిశువుకు బైపాస్‌ సర్జరీ చేశారు.

కాగా, హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ (ఏపీ–తెలంగాణ) మంగళవారం నిమ్స్‌ను సందర్శించి డాక్టర్‌ రమణ, ఆయన బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే గుండె సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన చిన్నారి నిత్యను గారెత్‌ పరామర్శించారు. నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. 

మరిన్ని వార్తలు