నేను..సీవీ ఆనంద్‌ను మాట్లాడుతున్న.. 

31 Jul, 2022 07:14 IST|Sakshi

బంజారాహిల్స్‌: తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ 100కు డయల్‌ చేశారు. దీంతో పోలీసులు కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్‌ వ్యాలీలో నగర పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ ఉంటున్నారు.

శుక్రవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం పెరగడంతో ఆయన వెంటనే 100కు డయల్‌ చేశారు. నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్‌ డీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్‌ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. స్వయంగా సీపీ 100కు డయల్‌ చేయడం అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది.  
(చదవండి: పెట్స్‌.. అదో స్టేటస్‌! )

మరిన్ని వార్తలు