అఫిడవిట్‌లో అలసత్వం వద్దు

17 Oct, 2023 03:30 IST|Sakshi

నామినేషన్‌ దాఖలులో జాగ్రత్తలు తప్పనిసరి ∙ముగ్గురు ఎమ్మెల్యేలకు అఫిడవిట్‌ తిప్పలు

తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్‌ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్‌లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్‌లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది.   ఓటర్ల హక్కు 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ.135 ట్రాఫిక్‌ చలాన్‌ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్‌ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్‌లో పేర్కొనలేదు.

పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్‌ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు  వన­మా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో వివరాల­ను టాంపరింగ్‌ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.  

పత్రికా ప్రకటనలు 
అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు.  

బీ ఫామ్‌ అందుకోగానే
బీ ఫామ్‌ అందుకోవడమే ఆలస్యం నామినేషన్‌ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు.

మరిన్ని వార్తలు