ఎగబడి కరుస్తున్నాయ్‌.. కుక్కలే కదా చంపేశారు.. చివరకు

9 Oct, 2021 11:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శునకాలను చంపించిన సర్పంచ్, కార్యదర్శిపై కేసు

సాక్షి, కోరుట్ల: ‘ఎగబడి కరుస్తున్నాయ్‌.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ అనుకుంటే కుదరదు. శునక వధ కారణంగా మేడిపల్లి మండలంలోని కొండాపూర్‌ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌లో కుక్కుల బెడద తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో చాలా మంది కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలైన ఘటనలూ ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు శునకాలను చంపాలని పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానించారు. పది రోజుల క్రితం కొన్నింటిని చంపేశారు. స్థానిక రాజకీయ విభేదాల కారణంగా ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా జంతు ప్రేమికులకు చేరింది.
చదవండి: నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌ కలకలం

వెంటనే స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఎర్త్‌ ప్రెసెన్స్‌ అనే జంతు ప్రేమికుల సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ శశికళ వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం కొండాపూర్‌ సర్పంచ్, కార్యదర్శిపై కేసు నమోదు చేసినట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు శుక్రవారం తెలిపారు. ప్రజల రక్షణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమపై కేసు నమోదు చేయడం సరికాదని సర్పంచ్‌ అభిలాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేడిపల్లి మండలవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు పలు గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. 
చదవండి: బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్‌ జగదీష్‌

మరిన్ని వార్తలు