రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా  టీఎస్‌పీఎస్సీ 

2 Oct, 2023 04:11 IST|Sakshi

కనీస అర్హతలు లేని వ్యక్తులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది 

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రేవంత్‌రెడ్డి 

బోర్డును రద్దు చేయాలన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ 

ఈ నెల 14న సడక్‌ బంద్‌కు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం పిలుపు

సాక్షి, హైదరాబాద్‌/పంజగుట్ట: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కనీస అర్హతలు లేని వ్యక్తులను కమిషన్‌ సభ్యులుగా ప్రభుత్వం నియమించడంతో కమిషన్‌ పనితీరు అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అల్లకల్లోలంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ అభ్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్‌లతో కలసి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి, కమిషన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. 

సీఎం కుటుంబానికి అవి ఏటీఎంలు... 
మంత్రి కేటీఆర్‌కు టీఎస్‌పీఎస్సీ, సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్సీ కవితకు సింగరేణి సంస్థలు ఏటీఎంలుగా మారాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్‌పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ఆయన డిమాండ్‌ చేశారు. గ్రూప్‌–1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పబట్టినా ఇప్పటికీ బోర్డును రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 90 లక్షల మంది ఓటు ద్వారా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏటా జనవరిలోనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్‌పీఎస్సీ తీరును నిరసిస్తూ ఈ నెల 14న సడక్‌ బంద్‌ (రహదారుల దిగ్బంధం) చేపట్టాలని పిలుపునిచ్చారు.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ‘సిట్‌’ నివేదిక వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపు మేరకు రహదారుల దిగ్బందానికి టీపీసీసీ పూర్తి మద్దతు ప్రకటించింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్‌ వినాయక్‌రావు పాల్గొనగా నిరుద్యోగులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి అధ్యక్షత వహించారు.

మరిన్ని వార్తలు