పాతగూటికి ‘రాములమ్మ’?

28 Oct, 2020 08:09 IST|Sakshi

విజయశాంతితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

రాములమ్మ భవితవ్యంపై జోరుగా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి అడుగులు ఎటువైపనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురూ చర్చలు జరిపారు. పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తోన్న ఆమె తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం, చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పాతగూటికి రావాలని, బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విజయశాంతిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారని, తనకు కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారనే ప్రచారం జరుగుతోంది.   (ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక)

రావడం లేదెందుకో?
వాస్తవానికి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించలేదనే అసంతృప్తి ఆమెకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాలు పం చుకోవట్లేదు. పార్టీ సమావేశాలకు కూడా వరుసగా గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు జరిగిన సమావేశాలకు ఆమెను ఆహ్వానించినా వెళ్లకుండా తన ఉద్దేశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపారు. ఇక, దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమెను పార్టీ కానీ, పార్టీని ఆమె కానీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. రాష్ట్ర నాయకత్వం కూడా విజయశాంతి వస్తే స్వాగతిస్తామని, పార్టీ కా ర్యకలాపాలకు ప్రత్యేక ఆహ్వానాలు ఉండవనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం  పెరిగింది. కాగా, పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని రాములమ్మ వర్గం వ్యాఖ్యానిస్తోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా