ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్‌ 

29 Nov, 2023 14:55 IST|Sakshi

ప్రలోభాలపై 24X7 నిఘా!

చెక్‌ పోస్టుల వద్ద ప్రతి వాహనం తనిఖీ: సీఈఓ వికాస్‌రాజ్‌ 

ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం.. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లపై కూడా..  

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా పోలింగ్‌ ముగిసిన అర్ధగంట తర్వాతే 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్‌ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్‌ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్‌ రూమ్స్‌ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. 

స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి...
ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్‌ పీరియడ్‌ ప్రారంభమైందని వికాస్‌ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు 

ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి 
నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్‌ సూచించారు. ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజేస్‌లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్‌ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు  

ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. 
పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్‌ ఫోన్స్, కార్డ్‌లెస్‌ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్‌ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్‌ పూర్తయిందని, పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్‌ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్‌ కేంద్రాలకు పంపిస్తారన్నారు.

పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్‌ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. 

ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు..     
పోలింగ్‌ రోజు మాక్‌ పోల్‌ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్‌ సూచించారు. ప్రిసైడింగ్‌ అధికారులు మాక్‌పోల్‌ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్‌ కంపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్‌ యూనిట్‌ మెమోరీని సైతం డిలీట్‌ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్‌ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు.  

పోస్టల్‌ బ్యాలెట్‌లో విఫలం కాలేదు.. 
పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్‌ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు.

మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, డిసెంబర్‌ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్‌ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు  

సెక్టోరియల్‌ అధికారులకు మెజిస్టీరియల్‌ అధికారాలు... 
ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్‌ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్‌ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్‌ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. 

పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్‌ ఆదేశం 
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్‌ 30న పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్‌ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు.   

మరిన్ని వార్తలు